-దాడి నుంచి వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్ రమేష్..
-స్థానికుల ప్రశంసలు
సిద్ధవటం, ( తెలుగు ప్రభ ):విధి నిర్వహణలో అప్రమత్తత, మానవత్వంతో వ్యవహరించి ఒక వ్యక్తిని దాడి నుంచి కాపాడిన పోలీసు కానిస్టేబుల్ రెడ్డిచెర్ల రమేష్‌పై స్థానికులు ప్రశంసలు కురిపించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ సమయస్ఫూర్తితో స్పందించి బాధితుడిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో ఆయనను ‘శభాష్ పోలీస్’ అంటూ అభినందించారు.రాజంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ నామినేషన్ల సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ఎదుట టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ, పరస్పర దాడులు జరిగినట్లు సమాచారం.
అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రెడ్డిచెర్ల రమేష్ ఈ పరిస్థితిని గమనించారు.ఒక వర్గానికి చెందిన వ్యక్తిపై కొందరు మూకుమ్మడిగా దాడికి పాల్పడుతున్న సమయంలో రమేష్ వెంటనే స్పందించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాడి చేస్తున్నవారి నుంచి ఆ వ్యక్తిని కాపాడి, సురక్షితంగా అక్కడి నుంచి బయటకు పంపించారు. ఉద్రిక్త పరిస్థితుల్లోనూ బాధ్యతాయుతంగా వ్యవహరించి వ్యక్తికి రక్షణ కల్పించడం ఆయన విధి నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది.
కానిస్టేబుల్ రమేష్ చూపిన సమయస్ఫూర్తి, మానవత్వాన్ని గమనించిన స్థానికులు ఆయనను అభినందించారు. పోలీసుల విధి కేవలం శాంతిభద్రతలను పరిరక్షించడమే కాకుండా, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమని ఈ ఘటన మరోసారి చాటిచెప్పిందని పలువురు పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం బాధ్యతతో వ్యవహరించిన కానిస్టేబుల్ రెడ్డిచెర్ల రమేష్‌కు స్థానికుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి.

