ఇటీవల తాడేపల్లిలోని వైసీపీ అధినేత జగన్(Jagan) ఇంటి ముందు గార్డెన్‌లో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఇవ్వాలని ఇప్పటికే వైసీపీ కార్యాలయానికి(YCP Ofiice) నోటీసులు పంపారు. అయితే ఆరోజు ఫుటేజీ అందుబాటులో లేదని పోలీసులకు వైసీపీ ఆఫీస్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో మరోసారి వైసీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అగ్నిప్రమాదం సంభవించిన రోజున కార్యాలయానికి వచ్చిన నేతలు, సందర్శకుల జాబితాను ఇవ్వాలని కోరారు. ఆఫీస్ బయట పార్క్ చేసిన వాహనాల నంబర్లు, వాహనదారుల వివరాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. అలాగే సీసీ కెమెరాల డేటా స్టోర్ అయ్యే హార్డ్ డిస్క్ అందజేయాలన్నారు.
కాగా జగన్ నివాసానికి పక్కనే వైసీపీ కేంద్ర కార్యాలయం ఉంటుంది. ఫిబ్రవరి 5వ తేది రాత్రి ఈ కార్యాలయం ఎదురుగా ఉన్న గార్డెన్‌లో మంటలు వ్యాపించాయి. దీనిపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తూ జగన్ భద్రతపై అనుమానాలు వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సీసీ ఫుటేజ్ ఇవ్వాలంటూ నోటీసులు పంపుతున్నారు. మరోవైపు ఈ ప్రమాదం నేపథ్యంలో జగన్ ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.