నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి(Posani Krishnamurali) రోజుకో జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో వారం రోజులు క్రితం అన్నమయ్య జిల్లా పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కోర్టు రిమాండ్ విధించడంతో మూడు రోజుల పాటు రాజంపేట సబ్‌జైలులో ఉన్నారు. అనంతరం నరసరావుపేటలో ఆయనపై మరో కేసు నమోదైంది. దీంతో అక్కడి పోలీసులు పోసానిని పీటీ వారెంట్‌పై అరెస్ట్ చేసి నరసరావుపేట కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకు తరలించారు.
మరోవైపు ఆయనపై కర్నూలు జిల్లా ఆదోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కూడా కేసు నమోదయింది. దీంతో ఆదోని పోలీసులు గుంటూరు జిల్లా జైల్లో ఉన్న పోసానిని పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గుంటూరు నుంచి ఆదోనికి తరలిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పోసాని ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కాగా ఈ కేసుకు సంబంధించి ఏపీ వ్యాప్తంగా పోసానిపై 17 కేసులు నమోదయ్యాయి.