వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళిని(Posani Krishna Murali) విజయవాడలోని భవానీపురం పోలీసుస్టేషన్‌కు తరలించారు. పీటీ వారెంట్‌పై కర్నూలు జిల్లా జైలు నుంచి పోసానిని ఇక్కడికి తీసుకొచ్చారు. కాసేపట్లో కోర్టులో హాజరుపర్చనున్నారు. ఒకవేళ న్యాయస్థానం రిమాండ్ విధిస్తే పోసానిని విజయవాడ జైలుకు తరలించే అవకాశం ఉంది. లేని పక్షంలో కర్నూలు జైలుకు పంపించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, వారి కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడంపై రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో 17 కేసులు నమోదయ్యాయి.
ఇదిలా ఉంటే విశాఖ, చిత్తూరు జిల్లాల్లో పోసానిపై నమోదైన కేసుల్లో హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కర్నూలు, నరసరావుపేట, రాజంపేట జిల్లాల్లో నమోదైన కేసుల్లో పోసాని రిమాండ్ ఖైదీగా ఉన్నారు.