వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) విడుదలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఆయన కోసం గుంటూరు సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లి పీటీ వారెంట్ వేశారు. దీంతో ఆయన్ను వర్చువల్ జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. కాగా, పోసానిపై నమోదైన కేసుల్లో బెయిల్ రాగా నేడు విడుదల అవుతారని వార్తలొచ్చాయి. తాజాగా సీఐడీ పీటీ వారెంట్ దాఖలుతో విడుదల నిలిచిపోనున్నట్లు సమాచారం.
సీఎం చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలపై నమోదైన కేసులో ఆదోని పోలీసులు పోసానిని అరెస్ట్ చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు ఆయన కర్నూలు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు నరసరావుపేటతో పాటు రాజంపేటలో నమోదైన కేసుల్లోనూ ఆయనకు బెయిల్ లభించింది. ప్రస్తుతం కర్నూలు జైలులో రిమాండ్ ఖైదీగా పోసాని ఉన్నారు. దీంతో బుధవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి రాష్ట్రవ్యాప్తంగా పలు స్టేషన్లలో కేసులు నమోదుకావడంతో ఆయా పోలీసులు అదుపులోకి తీసుకోకపోతే పోసాని విడుదల ఖాయమని న్యాయవాదులు చెబుతున్నారు. తాజాగా సీఐడీ పీటీ వారెంట్ దాఖలుతో విడుదల నిలిచిపోనున్నట్లు సమాచారం.