కడప ఘటనపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యుదాఘాతంతో గుంతపల్లి గ్రామానికి చెందిన కూరాకు జయరాం రెడ్డి (48) గురమ్మ (60) మృతి చెందటం బాధకరమన్నారు. ఒకే ఇంట్లో తల్లి, కుమారుడు చనిపోవడం తనని ఎంతోగానో కలిచి వేసిందన్నారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/kadapa_1724257922431_1724257928258.avif)
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. పొలాల్లోకి వెళ్లేటప్పుడు రైతులు జాగ్రత్త వహించాలన్నారు. వేలాడుతున్న కరెంట్ తీగలపై అధికారులకు తక్షణమే సమాచారం అందించాలన్నారు. నేలకు వేలాడే తీగలను గుర్తించి అధికారులు కూడా మరమ్మత్తులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. విద్యుదాఘాతం ఘటనలు పునారావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. తల్లి, కొడుకు విద్యుత్ ప్రమాదంలో ఒకే రోజు మృత్యువాతపడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పొలానికి నీరు అందిస్తుండగా షాక్
గుంతపల్లి గ్రామ సమీపాన ఉన్న తెలుగు గంగా కాలువలో మోటర్ పెట్టి పొలానికి నీరు అందిస్తున్నారు. మోటరు ఆడకపోవటంతో చిన్నపాటి మరమ్మత్తులు చేస్తున్న సమయంలో జయరాం రెడ్డికి విద్యుత్ షాక్ కొట్టి గిలగిలా కొట్టుకుంటున్నాడు. అది చూసిన తల్లి గురమ్మ కొడుకు జయరాంకి ఏమైందోనని కంగారులో పట్టుకోవటంతో ఆమె కూడా విద్యుత్ షాకుకి గురై చనిపోయింది.