Prakash Raj: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(PawanKalyan)పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల తరుచూ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో పవన్ కల్యాణ్ సనాతన ధర్మం కాపాడుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. సనాతన ధర్మం అంటూ ప్రజలను మత పరంగా పవన్.. రెచ్చగొడుతున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కూటా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు. ఇదిలా ఉండగానే తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ తీరుపై ప్రకాష్ రాజ్ విమర్శలు చేశారు.
ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ అంటే మీకెందుకు అంత కోపం అనే ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ పవన్ కల్యాణ్ మూర్ఖత్వంగా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అది తనకు నచ్చడం లేదని.. అది మాత్రమే చెబుతున్నానని తెలిపారు. ప్రజలు ఆయన్ను ఎన్నుకుంది ఇలాంటి రాజకీయాల కోసం కాదు కదా? అని ప్రశ్నించారు. ప్రజల తరుపున పవన్‌ని అడిగేవారు కూడా ఉండాలి కదా..అందుకే తాను అడుగుతున్నానని పేర్కొన్నారు. మతం పేరుతో రాజకీయం చేసే బీజేపీ అయోధ్యలో ఓడిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు తిరుమల కొండ ఎక్కడానికి వచ్చారన్నారు. మత తత్వ రాజకీయాలు దక్షిణ భారతదేశంలో బలపడే అవకాశం ఉండదని ప్రకాష్ రాజ్ వెల్లడించారు.
కాగా తనకు సినిమా ఛాన్సులు రాకుండా ఎవరూ అడ్డుకోలేరని ప్రకాష్ రాజ్ ధీమా వ్యక్తం చేశారు. తనకు సినిమాలు వస్తూనే ఉన్నాయని.. పనిచేస్తూనే ఉన్నానని తెలిపారు. సినిమాలు రాకుండా ఎవరైనా ఆపగలిగిరా అన్నారు. తన వల్ల సినిమా ఇండస్ట్రీలో ఎవరూ ఇబ్బంది పడలేదని.. సమాజంలో జరిగే తప్పులను చూస్తూ నోరు మెదపకుండా ఉండలేనని పేర్కొన్నారు. అవసరమైతే తనకు సినిమా అవకాశాలు కోల్పోయినా ప్రశ్నించడం మాత్రం ఆపనని స్పష్టం చేశారు.