పట్టణంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మికత తనిఖీలు నిర్వహించారు. బనగానపల్లె పట్టణంలోని కొండపేట ప్రాథమికోన్నత పాఠశాల, మూడవ సచివాలయం, జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను ప్రశ్నలు వేసి వారి పుస్తకాలను పరిశీలించారు.
విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించక పోవడం వల్లనే విద్యార్థులు చిన్న చిన్న ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేక పోతున్నారని అధ్యాపకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధన సిబ్బంది నిర్లక్ష్యంపై నంద్యాల జిల్లా డీఈవో సుధాకర్ , బనగానపల్లె ఎంఈఓ స్వరూపరానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మన స్కూల్లో చదివే పిల్లలకు కూర్చోడానికి డెస్కులు ఎందుకు లేవని ప్రశ్నించారు. విద్యాశాఖ అధికారులు పట్టించుకోక పోవడం వల్లనే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందన్నారు. వారంలో ఒకరోజు పాఠశాలలను ఆకస్మిక తనిఖీలు చేయాలని ఎంఇఓను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అమలు చేస్తున్న విద్యావిధానాన్ని పూర్తిస్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడానికి కృషి చేయాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉపాధ్యాయులను ఆదేశించారు. నాడు నేడు రెండవ దశ పనులను పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామచంద్ర రెడ్డిని శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు.