International Fleet Review-2026: భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి చాటిచెప్పేలా ‘ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR-2026)’ వేడుకలు విశాఖ తీరంలో అంబరాన్నంటాయి. నౌకాదళ విన్యాసాలతో హోరెత్తింది. అంతర్జాతీయ దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలను ప్రతిబింబిస్తూ జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు.
సముద్రంపై యుద్ధనౌకల విన్యాసాలు: ఈ కార్యక్రమంలో మొత్తం 71 యుద్ధనౌకలు ఆరు వరుసల్లో పరేడ్ నిర్వహించాయి. ఇందులో భారత నౌకాదళానికి చెందిన 45 నౌకలు ఉండగా.. రష్యా, ఆస్ట్రేలియా, యూఏఈ సహా వివిధ దేశాలకు చెందిన 19 విదేశీ యుద్ధనౌకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటితో పాటు కోస్ట్‌గార్డ్, మర్చంట్ నేవీ మరియు పరిశోధన నౌకలు సైతం ఈ విన్యాసాల్లో భాగస్వామ్యమయ్యాయి.
ఐఎన్ఎస్ సుమేధపై ప్రయాణం: గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘ఐఎన్ఎస్ సుమేధ’ నౌకపై ప్రయాణిస్తూ తీరంలో మోహరించిన యుద్ధనౌకలను పర్యవేక్షించారు. ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు విశాఖ తీరంలో జరిగే విస్తృత సముద్ర సంబంధిత కార్యక్రమాల్లో భాగంగా ఈ ‘ఫ్లీట్ రివ్యూ’ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. విదేశీ ప్రతినిధులు, ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం భారత సముద్ర రక్షణ కవచం ఎంత పటిష్టంగా ఉందో మరోసారి నిరూపించింది.
ప్రముఖుల హాజరు: ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.

