* గతంలో ఓసారొచ్చిన పులే రెండోసారొచ్చింది
* పులి సంచరించిన చోటు పరిశీలించిన అధికార్లు
* పులి దాడి భాదిత గోవుకు తక్షణ వైద్య సహాయం
* పశువులను మేతకు అడవుల్లోకి తోలుకెళ్ళొద్దు
* గిరిజనులు అందరూ అప్రమత్తంగా ఉండాలి
శంఖవరం (తెలుగుప్రభ) ; కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలో పులి సంచారంపై తక్షణమే తగు నిర్ధిష్టమైన సమాచారాన్ని ఇవ్వాలని గిరిజనులకు మండల తాహసిల్దార్ మొసలి సూరిబాబు పిలుపును ఇచ్చారు. పులి సంచారంపై వేళంగి, పెద మల్లాపురం గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామాల ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని, సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని, పశువులను సురక్షిత ప్రాంతాల్లోనే ఉంచాలని, పశువులను మేతకు అడవుల్లోకి తోలుకెళ్ళొద్దని, అలాగే ప్రజలు కూడా వెళ్ళొద్దని, ఎవరూ ఒంటరిగా ఆరుబయట సంచరించొద్దని ఆయన ప్రజలను అప్రమత్తం చేశారు. మండలంలోని ఆవెల్తి గ్రామ పరిసరాల్లో పెద్దపులి సంచరించిన ప్రాంతాల్లో తాహసిల్దారు సూరిబాబు ఆధ్వర్యంలో మండల తాహసిల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ (మండల ఇంఛార్జి రెవెన్యూ ఇనస్పెక్టరు) ఉప్పు దుర్గా బాలాజీ రమణమూర్తి, రౌతులపూడి సెక్షన్ అటవీశాఖ అధికారి పైడా శ్యాంకుమార్, శంఖవరం పశువైద్యశాఖ సహాయ సంచాలకులు పీతల మనోజ్ కుమార్, అన్నవరం ప్రభుత్వ పశువుల ఆస్పత్రి వైద్యులు కాకర్ల ప్రసాద్, వేళంగి, గొంది కొత్తపల్లి, శంఖవరం, కొంతంగి గ్రామాల రెవెన్యూ అధికార్లు పల్లాల వెంకటరెడ్డి, మొసలిపాం సింహాచలం, తాటిపాక అచ్యుతం, తిరుమలనీడి సీతారాం అధికారుల బృందం శనివారం అవెల్తి గ్రామాన్ని సందర్శించింది. పులి సంచారంపై ఆరా తీసారు. గతంలో ఓసారొచ్చిన పులే ఈ రెండోసారొచ్చిందని నిర్ధారించు కున్నారు. శుక్రవారం ఉదయం అడవిలోకి మేతకు వెళ్లి సాయంత్రం 3-4 గంటల మధ్య పులి దాడికి గురైన, ఆవెల్తి గోము ధర్మరాజుకి చెందిన రెండు ఆవులనూ అధికార్ల బృందం పరిశీలించింది. రెండింటి ఒకటి మృతి చెందగా గాయాలతో ప్రాణాపాయం నుంచి బయట బపడిన మరొక ఆవుకు తక్షణమే పశు సంవర్ధకశాఖ వైద్యులు పరీక్షించి చికిత్స చేసి వైద్య సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా తాహసిల్దారు మొసలి సూరిబాబు గ్రామ ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలు తక్షణమే తీసుకోవాల్సిన పలు ముందస్తు జాగ్రత్తలను సూచించారు. వేళంగి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆవెల్తి, ఒండ్రేగుల, అనుమర్తి తోపాటు పెదమల్లాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో కూడా పులి సంచరించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అడవి ప్రాంతాల్లో సంచరించరాదని, పశువు (మేకలు, ఆవులు, గేదెలు)లను అడవిలోనికి మేతకు పంపరాదనీ, వాటిని సురక్షిత ప్రాంతాల్లోనే ఉంచాలని ప్రజలను అప్రమత్తం చేసారు. పులి నుంచి ప్రజలకు హాని కలుగకుండా ఉండేందుకు, పులిని సురక్షితంగా బంధించేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు, ఏర్పాట్లనూ చేస్తోందని గిరిజనులకు శంఖవరం మండల తాహసిల్దార్ మొసలి సూరిబాబు ఉమశమన మాటలు చెప్పారు.

