అమరావతి(Amaravati) పునః ప్రారంభం అవుతున్న వేళ ఏపీ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. 2026, జనవరి 1న అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్(Quantum Valle) కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించింది. ఈమేరకు సీఎం చంద్రబాబు సమక్షంలో ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ , లార్సన్ & టూబ్రో(L&T) సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది. దీంతో అమరావతిలో భారతదేశపు మొట్టమొదటి, అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ నిర్మాణం కానుంది. దేశంలోనే తొలిసారి ఐబీఎం అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్ కలిగిన ‘క్వాంటం సిస్టం 2’ని అమరావతిలో నెలకొల్పనుంది.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ ఒప్పందం ఆంధ్రప్రదేశ్‌కే కాదు భారతదేశానికి కూడా చారిత్రాత్మకం అని అన్నారు. ‘క్వాంటమ్ కంప్యూటింగ్’ భవిష్యత్ పాలనకు, ఆవిష్కరణలకు పునాది అవుతుందని చెప్పారు. సాంకేతికరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త అవకాశాలు వస్తున్నాయని, అయితే వాటిని అందిపుచ్చుకోవడం ముఖ్యమని సీఎం అన్నారు. భవిష్యత్ అవసరాలన్నీ క్వాంటం కంప్యూటింగ్‌పైనే ఆధారపడి ఉంటాయన్నారు. సిలికాన్ వ్యాలీ తరహాలో క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దాలని ఐబీఎం, (IBM) టీసీఎస్ (TCS) సంస్థల ప్రతినిధులకు సూచించారు.