ఒడిశాలోని బాలాసోర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నియామకాల పరీక్షల సందర్భంగా ప్రశ్న పత్రాలు లీకేజీ కావడంపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నప్పుడు, తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఒళ్లు గగుర్పొడిచే పరిణామాలెన్నో బయటపడ్డాయి. ఈ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంతో మరో మూడు రాష్ట్రాలకు సంబంధం ఉన్నట్టు, ఈ నెట్ వర్క్ ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించినట్టు తెలియ వచ్చింది. గతంలో కూడా వివిధ నియామక పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీకేజీ అవడం, వీటిని ఢిల్లీ, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పంపిణీ చేయడం జరిగిందని తెలిసింది. సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ నియామకాలకు సంబంధించిన ప్రశ్న పత్రాలను సైతం ఢిల్లీలో లీక్ చేయడం జరిగింది. నాలుగు రాష్ట్రాలకు చెందినవారితో ఏర్పడిన ముఠా ఒకటి ఈ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారాల్లో చురుకుగా, క్రియాశీలంగా పనిచేస్తోందని, ఈ ముఠాయే ఇటీవల పశ్చిమ బెంగాల్ లో కూడా ప్రశ్న పత్రాలు లీకేజీ చేసిందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
పాట్నాలో ఒక కోచింగ్ సెంటర్ ను ప్రారంభించిన ఈ ముఠా నాయకుడు ఆ తర్వాత ప్రభుత్వ నియామకాల పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాల లీకేజీ మీద దృష్టి కేంద్రీకరించాడు. దేశ వ్యాప్తంగా నియామక పరీక్షలకు ఒక పక్క శిక్షణనిస్తూనే అతను తన అక్రమ కార్యకలాపాలను కొనసాగించాడు. బాలాసోర్ లో ప్రశ్న పత్రాల లీకేజీ మీద దర్యాప్తు చేస్తున్న అధికారులు తమ ప్రయత్నాలలో విజయం సాధిస్తుండడం గమనించి ఈ ముఠా నాయకుడు ప్రస్తుతానికి అజ్ఞాతం లోకి వెళ్లాడు. అయితే, దర్యాప్తులో తేలిందేమిటంటే, ప్రశ్న పత్రాల లీకేజీ అన్నది దేశవ్యాప్త నేరంగా మారిపోయింది. తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని అనేక రాష్ట్రాలలో ఈ అక్రమ వ్యవహారం జరుగుతున్న తీరును బట్టి ఇది దేశవ్యాప్త నేరంగా మారిపోయిందనే భావన కలుగుతోంది.
ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో కూడా ఇటువంటి లీకేజీ వ్యవహారమే చోటు చేసుకుంది. ఈ లీకేజీ వ్యవహారంలో అనేక రాష్ట్రాలవారికి సంబంధం ఉన్నట్టు దర్యాప్తులో నిర్ధారణ అయింది. ఈ నియామక పరీక్షల వ్యవస్థలోనే అనేక లొసుగులు ఉన్నట్టు బాలాసోర్ దర్యాప్తులో వెల్లడైంది. విద్యా రంగానికి చెందిన పలువురు వ్యక్తులకు ఈ లీకేజీలతో ప్రత్యక్ష సంబంధాలున్నట్టు కూడా రుజువైంది. ప్రశ్న పత్రాలను రూపొందించేవారు, కోచింగ్ సెంటర్లు, కన్సల్టెంట్లు, ప్రచురణకర్తలు వగైరాలందరికీ ఈ వ్యవహారాలతో ప్రమేయం అయి నట్టు కూడా నిర్ధారణ అయింది. ఈ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం ఎంత పెనుభూతంగా తయారైందంటే, దీనిని నిరోధించడానికి గుజరాత్, రాజస్థాన్, హర్యానా ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను రూపొందించాల్సి వచ్చింది.
అంతేకాదు, ఈ రాష్ట్రాలలో ప్రశ్న పత్రాల లీకేజీని నిరోధించడమన్నది ఒక ఎన్నికల ప్రచారాంశంగా కూడా మారిపోయింది. రాజస్థాన్ రాష్ట్రంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ప్రభుత్వ పరీక్షల చట్టాన్ని సవరించి, శిక్షా కాలాన్ని పెంచడం జరిగింది. నిరుద్యోగ సమస్య ఒక పెద్ద సమస్యగా ఉన్న దేశంలో ఇటువంటి లీకేజీల వల్ల, పరీక్షల రద్దు వల్ల నిరుద్యోగులు మరింతగా కుంగిపోయే అవకాశం ఉంటుంది. నియామ కాల ప్రక్రియ కూడా ఆలస్యం అయి ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. పాలనా యంత్రాంగం శక్తిసామర్థ్యాల మీద నమ్మకం సన్నగిలుతుంది. ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగుల సంఖ్య, నియామకాల సంఖ్య తగ్గడం వల్ల పాలనా యంత్రాంగంలో సమస్యలు పెరుగుతాయి.
ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఆయా ప్రభుత్వాలు గట్టి చర్యలు చేపడుతున్నప్పటికీ, ఉమ్మడిగా కూడా ఒక యంత్రాంగం ఏర్పడాల్సిన అవసరం ఉంది. జాతీయస్థాయిలో ఒక యంత్రాంగం ఏర్పడడం వల్ల, సంప్రదింపులకు అవకాశం ఏర్పడడం వల్ల ఈ బెడద చాలావరకు తగ్గే అవకాశం ఉంటుంది. దీనికి పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలు, జీవనోపాధులు కుప్పకూలే ప్రమాదం ఉంది.
Question paper leakage: దేశవ్యాప్త నేరంగా ప్రశ్న పత్రాల లీకేజీ
ప్రశ్నాపత్రాల లీకేజీ ఎన్నికల అంశంగా కూడా మారిపోయింది
సంబంధిత వార్తలు | RELATED ARTICLES