Raghava Reddy| వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి (Avinash Reddy) పీఏ రాఘవరెడ్డికి కడప జిల్లా కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఆ పార్టీ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు రాఘవరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మాజీ సీఎం జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లి షర్మిల, మరో సోదరి సునీతపై వర్రాతో అసభ్యకరమైన పోస్టులు పెట్టించారని రాఘవరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేయడంతో 16 రోజులుగా రాఘవరెడ్డి పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.