Raghuram Krishna Raju strong warning to YS Jagan: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వం రద్దువుతుందా? ఆయనపై స్పీకర్ చర్యలు తీసుకోనున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. తాజాగా, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వచ్చారంటూ, అలాంటి వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై స్పందించబోనంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాంటి వారిని అసెంబ్లీలోకి అనుమతించిన స్పీకర్‌కు బుద్ధుండాలి అంటూ పరోక్షంగా రఘురామ కృష్ణం రాజుపై మండిపడ్డారు. దీంతో, ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. జగన్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూటమి నేతల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే జగన్‌పై చర్యలు తీసుకునేందుకు స్పీకర్ సైతం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా శాసనసభ నియమ నిబంధనల ప్రకారం, అసెంబ్లీ 60 పని దినాల్లో ఎలాంటి సమాచారమూ లేకుండా ఎవరైనా గైర్హాజరైతే అతడి శాసన సభ్యత్వం ఆటోమేటిగ్గా రద్దవుతుంది. అయితే, ఈ విషయాన్ని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలోనే స్పష్టం చేశారు. అయితే, తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలతో ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్.. ఆ తర్వాత అసెంబ్లీలో అధికారికంగా సంతకం చేయలేదు. దీంతో, ఆయన సభ్యత్వం రద్దు అంశంపై చర్చ జరుగుతోంది. గతంలో రఘురామరాజు మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా కోసం కోర్టులో కేసు వేశానంటే కుదరదని స్పష్టం చేశారు. శాసనసభకు 60 పని దినాలలో ఎలాంటి సమాచారమూ లేకుండా గైర్హాజరైతే ఆ సభ్యుడి శాసన సభ్యత్వం ఆటోమేటిగ్గా రద్దవుతుందని తేల్చిచెప్పారు. దీంతో జగన్ సభ్యత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది. 2024 సాధారణ ఎన్నికలు పూర్తయ్యాక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి మాత్రమే జగన్ హాజరయ్యారు. ఆ తర్వాత అసెంబ్లీకి ఆయన హాజరుకాలేదు. ప్రతిపక్ష హోదా కోరుతూ కోర్టు మెట్టు ఎక్కారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు అసెంబ్లీకి రానని భీష్మించుకు కూర్చున్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ప్రసంగానికి సైతం జగన్ గైర్హాజరయ్యారు.
60 రోజుల పాటు గైర్హాజరైతే శాసన సభ్యత్వం రద్దు..!
గతేడాది జూలైలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన సమయంలో జగన్ శాసనసభకు వచ్చారు. ఆ తర్వాత బడ్జెట్ సమావేశాల్లోనూ ఫిబ్రవరి 24న గవర్నర్ ప్రసంగానికి వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్లారు. అయితే, నిబంధనల ప్రకారం ఈ రెండు రోజులూ శాసనసభ జరిగినట్టు అధికారికంగా పరిగణించరు. దీంతో జగన్ శాసనసభకు హాజరుకానట్టుగానే భావిస్తారు. టెక్నికల్‌గా చూస్తే గవర్నర్ ఉభయసభలకు చెందిన సభ్యుడు కాకపోవటంతో ఆయన ప్రసంగం చేసిన రోజును పరిగణలోకి తీసుకోరని అధికారులు అంటున్నారు. ఆయన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టిన రోజే శాసనసభ లేదా మండలికి అధికారిక బిజినెస్ డే అవుతందని తేల్చి చెబుతున్నారు. రెండుసార్లూ జగన్ వచ్చిన రోజులు శాసనసభ బిజినెస్ డే గా నమోదు కాకపోవటంతో ప్రస్తుతం ఆయన హాజరుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆయన సభ్యత్వం రద్దు విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆయన విచాక్షణాధికారం దృష్ట్యా ఆచీతూచీ నిర్ణయం తీసుకుంటారు. అయితే, ఏపీలో ప్రస్తుతం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై సస్పెన్స్‌గా మారింది.


