Aakividu Temple Raghurama KrishnaRaju: ఆకివీడు రామాలయ పునర్నిర్మాణంపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కీలక ప్రకటన చేశారు. 8 శతాబ్దాలైనా చెక్కుచెదరకుండా ఆలయాన్ని కృష్ణశిలతో అద్భుతంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. కాగా, ఇటీవల ఇదే ఆలయం వద్ద రఘురామ నిరసన ఎదుర్కొన్న నేపథ్యంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో చారిత్రక నేపథ్యం ఉన్న శ్రీరామ మందిరాన్ని అత్యంత వైభవంగా, వందల ఏళ్లయినా చెక్కుచెదరని రీతిలో పునర్నిర్మించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ప్రకటించారు. ఈ ఆలయానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉందని.. 1923 నాటి ప్రభుత్వ రికార్డుల్లో కూడా ఈ ఆలయ ప్రస్తావన ఉందని రఘురామ పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా, సమాజంలోని అన్ని వర్గాల సహకారంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించారు.
రాబోయే 8 శతాబ్దాల పాటు ఎటువంటి పగుళ్లు రాకుండా, అత్యంత పటిష్ఠంగా ఈ ఆలయ నిర్మాణం చేపడతామని రఘురామ స్పష్టం చేశారు. అయోధ్య రామమందిర తరహాలోనే నాణ్యమైన రాళ్లతో ఈ నిర్మాణం జరగనుందని చెప్పారు.
కాగా, ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా ఆకివీడు రామాలయ సందర్శన సమయంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పూజలు నిర్వహించేందుకు రఘురామ వెళ్లగా ఆయన రాకను వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. శిథిలావస్థకి చేరిన ఆలయం స్థానంలో గొంతెనమ్మ ఆలయం కట్టాలని డిమాండ్ చేశాయి. ఆ కాసేపటికి రామాలయ ఆలయ పునర్నిర్మాణానికి మద్దతు తెలుపుతున్న వర్గం, వ్యతిరేకిస్తున్న దళిత వర్గం పరస్పరం దాడులు చేసుకున్నాయి.

