AP Rains| ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన ప్రజలను కలవరపెడుతోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ట్రింకోమలికి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకు 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపటిలోగా వాయుగుండం బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. రానున్న 48 గంటల్లో నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పుకొచ్చారు. దీంతో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.