ఏపీలో రెండు రోజులపాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి లతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో తమిళనాడుతో పాటు రాయలసీమలో చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి.
వాయుగుండం ప్రభావంతో.. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో 20,21 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. అలాగే తీరం వెంబడి గంటకు 40-55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. రెండ్రోజుల పాటు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటివరకూ కురిసిన వర్షాలకు తమిళనాడు చిగురుటాకులా వణికిపోతోంది. గత వారం కూడా అక్కడ భారీ వర్షాలు కురవగా.. విద్యాసంస్థలకు సర్కారు సెలవు ప్రకటించింది. లోతట్టు ప్రాంతాలతో పాటు.. రహదారులన్నీ జలమయమయ్యాయి.
ఇటు ఏపీలోనూ భారీ వర్షసూచన రైతుల గుండెల్లో గుబులు రేపుతోంది. వరి, అరటి, ఇతర వ్యవసాయ పంటలను సాగు చేస్తున్న సమయంలో భారీవర్షాలు పడితే.. నెలరోజుల్లో చేతికి వచ్చే పంట నీళ్లుపాలైపోతుందని భయపడుతున్నారు. మరో వారం రోజుల్లో వరి పంటలకు కోతలు మొదలవ్వనున్న నేపథ్యంలో వాతావరణంలో వస్తున్న మార్పులు రైతన్నకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో 5 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.