Rains in Ap: ఏపీ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్. రాగాల 2 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడతాయని చెప్పింది.
కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు సమయంలో రాష్ట్రంలో పలు చోట్ల వర్షపాతం నమోదైన.. ఈ మధ్య వర్షాలు పూర్తిగా కనుమరుగు అయిపోయాయి. అయితే తాజా వార్తతో ఏపీ ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు.
నేడు యానంతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు సుమారు 40 – 50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
మరోవైపు రాయల సీమతో పాటు దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో కూడా తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇక నేటి విషయానికొస్తే.. పార్వతి పురం మన్యం తో పాటు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
నిన్న గరిష్టంగా శ్రీశైలంలో 40 మి.మీ, చిత్తూరులో 19 మి.మీ, రాజ మహేంద్ర వరంలో 30 మి.మీ, అమలాపురంలో 18 మి.మీ, కాకినాడలో 13 మి.మీ, యానాంలో 6.6 మి.మీ అలాగే నెల్లూరులో 6.6 మి.మీ, తణుకులో 4.8 మి.మీ, కావలిలో 4 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు తెలిపింది.