HomeTop StoriesAP Liquor Scam: ఏపీ లిక్కర్‌ కేసులో కీలక పరిణామం.. ఈడీ అదుపులో రాజ్‌కెసిరెడ్డి

AP Liquor Scam: ఏపీ లిక్కర్‌ కేసులో కీలక పరిణామం.. ఈడీ అదుపులో రాజ్‌కెసిరెడ్డి

Raj Kasireddy Arrested in AP Liquor Scam: తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన లిక్కర్‌ స్కామ్‌లో మరో అరెస్టు చోటుచేసుకుంది. ఈ స్కామ్‌లో కీలక సూత్రధారి రాజ్‌కెసిరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి ఈడీ అధికారులు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సోదాలు చేపట్టారు. ఈ కేసులో కీలక సూత్రధారి రాజ్‌ కెసిరెడ్డి ఇళ్లతో పాటు మరో ఆరుగురు నిందితుల ఇళ్లలో ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ఆయన బంధువు నరసింహారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లోనూ దాడులు జరిపారు. ఏపీ మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని ఈడీ అధికారులు గుర్తించారు. హవాలా, మనీలాండరింగ్‌ ద్వారా భారీ ఎత్తున నిధులు తరలించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలో నానక్‌రామ్‌గూడలోని రాజ్‌కెసిరెడ్డి ఇంటిలో ఆయన్ను ఈడీ అరెస్ట్‌ చేసింది. ఈ కేసుతో సంబంధమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇల్లు, కార్యాలయంలోనూ ఈడీ సోదాలు జరిపింది.

- Advertisement -

Also Read: Suicide : కామారెడ్డిలో విషాదం.. కష్టాల కడలిని ఈదలేక చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి మృతి

కాగా, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల విలువైన లిక్కర్‌ స్కామ్‌లో నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద అభియోగాలు మోపి, తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్టు (ఈసీఐఆర్‌) నమోదు చేసిన ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో 33 మందిని నిందితులుగా చేర్చగా.. లిక్కర్‌ స్కామ్‌లో అన్నీ తానై వ్యవహరించిన రాజ్‌ కెసిరెడ్డితో పాటు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, నాడు వైసీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి, జగన్‌ సీఎంగా పని చేసినంత కాలం సీఎంవో కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ధనుంజయరెడ్డి, జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్స్‌ పూర్తికాలపు డైరెక్టర్‌ గోవిందప్ప బాలాజీలతో పాటు ఏపీఎస్‌బీసీఎల్‌ మాజీ ఎండీ డి.వాసుదేవరెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్‌ ప్రత్యేకాధికారి సత్యప్రసాద్, ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ మాజీ డైరెక్టర్‌ సజ్జల శ్రీధర్‌రెడ్డి, మద్యం ముడుపుల వసూళ్లలో కీలకంగా వ్యవహరించిన రాజ్‌ కెసిరెడ్డి తోడల్లుడు ముప్పిడి అవినాష్‌రెడ్డి, వీరి అనుచరులు బూనేటి చాణక్య, టి.కిరణ్‌కుమార్‌రెడ్డి, సైఫ్‌ అహ్మద్‌ ఉన్నారు. వీరితో పాటు లిక్కర్‌ కేసులో తీసుకున్న ముడుపులను దారి మల్లించేందుకు వినియోగించిన పలు డొల్ల సంస్థలకు చెందిన యాజమాన్యాలను నిందితులుగా ఈడీ చేర్చింది. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద మద్యం కుంభకోణం కావటంతో పాటు సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి వసూలు చేసిన దాదాపు రూ. 3,200 కోట్ల ముడుపులను ఫేక్‌ కంపెనీల ద్వారా దారి మళ్లించినట్లు ప్రాథమికంగా ఈడీ అధికారులు గుర్తించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News