రాజమండ్రి జిల్లాలో చాగల్లు మండలం బ్రాహ్మణ గూడెం, ధారవరంలో రెండు మిల్లుల యాజమానులు రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలియడంతో వారిని ధాన్యం సేకరణ చేసే ప్రక్రియ నుంచి తొలగించినట్టు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. కలెక్టరేట్ లో ఈ మేరకు కలెక్టర్ కె. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ లు ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత వివరాలు తెలియచేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం , జిల్లా యంత్రాంగం ఎంతో పారదర్శకత జవాబుదారీతనం తో కూడి రైతుల నుంచి ధాన్యం సేకరణ చెయ్యడం జరుగుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో మిల్లర్లు ఎవ్వరూ రైతుల నుంచి డబ్బులు వసూలు చెయ్యరాదని స్పష్టం పేర్కొంటూ, అటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించామన్నారు.
తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలం బ్రాహ్మణ గూడెం కు చెందిన సూర్య దత్త ట్రేడర్స్, ధారవరంకు చెందిన శ్రీ తేజా ఏజెన్సీస్ లపై రైతుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఆరోపణలు నేపథ్యంలో వారిని కస్టమైజ్డ్ మిల్లింగ్ రైస్ సేకరణ పక్రియ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు మాధవీలత తెలియ చేశారు. జిల్లాలో రైతుల నుంచి డబ్బులు వసూలు చేసే వారికి ఇది ఒక హెచ్చరిక అని ఆ ప్రకటనలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లు స్పష్టంగా పేర్కొన్నారు.
కమీషనర్ పౌరసరఫరాల కార్యాలయంలో కమాండ్ & కంట్రోల్ నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్ కాల్‌ల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా మిల్లుల్లో డబ్బు వసూలు చేయడంపై వచ్చిన నివేదికల సంఖ్య భారీగా ఉండడం తో రెండు మిల్లులు పై చర్యలు తీసుకున్నట్టు జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలిపారు.
- సూర్య దత్తా ట్రేడర్స్ బ్రాహ్మణగూడెం – డబ్బు వసూలుపై 11 ఫిర్యాదులు, శ్రీ తేజ ఆగ్రోస్ దారవరం పై డబ్బు వసూలుపై వచ్చిన 5 ఫిర్యాదుల మేరకు తదుపరి CMR కార్యకలాపాల నుండి మూసి వేయబడిందని తెలిపారు. సంబంధిత మిల్లులను వచ్చే ఖరీఫ్ సీజన్‌లో కూడా పాల్గొనేందుకు అనుమతించరని తెలిపారు. వారి మిల్లింగ్ ఛార్జీలు కూడా 50% వరకు తగ్గుతాయని జేసీ వెల్లడించారు. ఆ మిల్లుల కస్టోడియన్ అధికారులను కూడా తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేశామని జాయింట్ కలెక్టర్ తెలిపారు.