YS Jagan| ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా రెడ్‌బుక్ పాలన నడుస్తోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. ఎటు చూసినా లిక్కర్, ఇసుక స్కామ్‌లతో పాటు పేకాట క్లబ్బులే కనిపిస్తున్నాయని ఆరోపించారు. ఏ పని చేయాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా సీఎం చంద్రబాబు(CM Chandrababu)కి, ఎమ్మెల్యేలకు ఇంతా అని ముట్ట చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని ఆరోపణలు చేశారు.
ఆరోగ్యశ్రీ(Arogyashri)లో రూ.2వేల కోట్ల బకాయిలు ఉన్నాయని.. విద్యాదీవెన లేక డ్రాపౌట్లు పెరుగుతున్నాయని వాపోయారు. ప్రజలకు మంచి చేయాలని తాము ప్రతి అడుగు ముందుకు వేశామన్నారు. ఎన్నడూ ఊహించని మార్పులు తీసుకురాగలిగామన్నారు. ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చామని గుర్తుచేశారు.
లంచాలు, వివక్ష లేకుండా ఇంటి వద్దకే ప్రతి పథకం డోర్ డెలివరీ ఇచ్చామని చెప్పుకొచ్చారు. మళ్ళీ జన్మభూమి కమిటీలు, టీడీపీ నేతల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తమ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథం వైపు పయనిస్తే.. ఇప్పుడు తిరోగమనం వైపు పయనిస్తోందని జగన్ వెల్లడించారు.