Homeఆంధ్రప్రదేశ్ADR Report: ప్రాంతీయ పార్టీల ‘పైకా’నికి బ్రేకులు: ఆదాయంలో ‘సైకిల్’ జోరు.. ఖర్చులో ‘ఫ్యాన్’ హుషారు!

ADR Report: ప్రాంతీయ పార్టీల ‘పైకా’నికి బ్రేకులు: ఆదాయంలో ‘సైకిల్’ జోరు.. ఖర్చులో ‘ఫ్యాన్’ హుషారు!

Regional Political Parties Income Analysis : రాజకీయాల్లో ‘అర్థ’బలం కీలకం. ఎన్నికల రణక్షేత్రంలో గెలవాలన్నా, క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకోవాలన్నా పార్టీల ఖజానాలో కాసులు కురవాల్సిందే. అయితే, గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీల విరాళాల ప్రవాహం ఒక్కసారిగా మందగించిందా? కుబేర పార్టీలుగా పేరుగాంచిన ప్రాంతీయ శక్తుల ఆదాయం ఎందుకు సగానికి సగం పడిపోయింది? అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తాజాగా విడుదల చేసిన విశ్లేషణాత్మక నివేదిక రాజకీయ వర్గాల్లో ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ నివేదికలోని ముఖ్యాంశాలు, పార్టీల వారీగా ఆదాయ-వ్యయాల లెక్కలు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. 

- Advertisement -

కుదేలైన ఆదాయం.. కళ్లు చెదిరే గణాంకాలు : అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) మే 27న విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 36 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం రూ. 1,192.94 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఈ పార్టీల ఆదాయం రూ. 2,463.17 కోట్లుగా ఉండేది. అంటే, కేవలం ఏడాది కాలంలోనే ప్రాంతీయ పార్టీల ఆదాయం ఏకంగా 51.57 శాతం తగ్గింది. ‘ఆదాయం తక్కువ.. ఖర్చు ఎక్కువ’ అన్న చందంగా, ఈ పార్టీలు తమ ఆదాయం కంటే రూ. 240.12 కోట్లు (సుమారు 20 శాతం) అదనంగా ఖర్చు చేయడం గమనార్హం. మొత్తం 36 పార్టీలలో 21 పార్టీలు తాము సంపాదించిన దానికంటే ఎక్కువే ఖర్చు చేసి ‘తడిసి మోపెడవ్వడం’ గమనార్హం.

ఆదాయంలో ‘దేశం’ టాప్ : తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ (TDP) ఆదాయార్జనలో జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల సరసన ప్రథమ స్థానంలో నిలిచింది.
తెలుగుదేశం పార్టీ (TDP): రూ. 228.31 కోట్లతో మొదటి స్థానం. మొత్తం 36 పార్టీల ఆదాయంలో ఈ పార్టీ వాటా 19.14 శాతంగా ఉంది.
తృణమూల్ కాంగ్రెస్ (TMC): రూ. 219.35 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP): రూ. 140.39 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది.
ఈ మొదటి మూడు పార్టీలే ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయంలో సింహభాగాన్ని కలిగి ఉన్నాయి

ఖర్చులో ‘ఫ్యాన్’ జోరు : ఆదాయం విషయంలో మూడో స్థానంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఖర్చుల విషయంలో మాత్రం అగ్రస్థానంలో నిలిచింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSRCP): రూ. 340.20 కోట్లు ఖర్చు చేసి మొదటి స్థానంలో నిలిచింది. ఇది ఆ పార్టీ వార్షిక ఆదాయం కంటే రెట్టింపు కంటే ఎక్కువ ఉండటం గమనార్హం.
బిజూ జనతా దళ్ (BJD): రూ. 288.44 కోట్లతో రెండో స్థానం.
తృణమూల్ కాంగ్రెస్ (TMC): రూ. 227.59 కోట్లతో మూడో స్థానంలో ఉంది.

ఆడిట్ రిపోర్టుల దాగుడుమూతలు : ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రతి పార్టీ తమ వార్షిక ఆడిట్ నివేదికలను సకాలంలో సమర్పించాలి. అయితే, 67 గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల్లో కేవలం 36 పార్టీలు మాత్రమే ఆడిట్ వివరాలను అందజేశాయి. మిగిలిన 31 పార్టీలు గడువు ముగిసి 207 రోజులు గడిచినా తమ లెక్కలను ఈసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచకపోవడంపై ఏడీఆర్ విస్మయం వ్యక్తం చేసింది. రాజకీయ పారదర్శకత ప్రశ్నార్థకమవుతున్న వేళ, ఈ అసంపూర్ణ గణాంకాలు భవిష్యత్తులో ఇంకెన్ని నిజాలను బయటపెడతాయో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News