Renuka Chowdary: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా, కూటమి తమది సుపరిపాలన అని చెబుతుండగా, ప్రతిపక్ష వైసీపీ మాత్రం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆరోపిస్తోంది. అయితే, తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించాయి.
ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌లో ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో, రేణుకా చౌదరి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. యాంకర్ “ఏపీలో బాబు పాలనకు మీరు ఎన్ని మార్కులు వేస్తారు?” అని అడగ్గా, ప్రజలు ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబుకు ఎన్నో ఆశలతో అధికారం కట్టబెట్టారని, అయితే ఆయన వారిని పూర్తిగా నిరాశపరిచారని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలన ఏమాత్రం సంతృప్తికరంగా లేదని, ప్రజలు ఆశించిన స్థాయిలో పాలన సాగడం లేదని ఆమె స్పష్టం చేశారు.
బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా చంద్రబాబు ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. బీజేపీ చెప్పిన పనులు చేయడమే చంద్రబాబుకు పనిగా మారిందని ఆరోపించారు. చెప్పడానికి క్షమించమని కోరుతూనే, చంద్రబాబు గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని, గతంతో పోలిస్తే ఆయన వ్యవహార శైలి కూడా మారిపోయిందని ఆమె అన్నారు. ఏపీలో చంద్రబాబు ఏదో ఉద్ధరిస్తారని అనుకుంటే, ఏమీ చేయలేకపోతున్నారని రేణుక అభిప్రాయపడ్డారు. ఊహించని విధంగా, చాలా త్వరగా బాబు గ్రాఫ్ పడిపోయిందని ఆమె అన్నారు.
రేణుకా చౌదరి వ్యాఖ్యల వెనుక ఉన్న కారణాలు, వాటిలో వాస్తవాలను పరిశీలిస్తే, గతంలో అమరావతి రైతులకు ఆమె మద్దతుగా నిలిచారు. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏపీకి వచ్చి అమరావతి టూ అరసవల్లి రైతుల పాదయాత్రను ప్రారంభించి, అప్పట్లో వైసీపీ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమరావతి రైతులకు తాను అండగా ఉంటానని అనేకసార్లు ప్రకటించారు. దీంతో, అమరావతి రాజధాని రైతుల విషయంలో బాబు ప్రభుత్వం తీరు పట్ల ఆమె అసంతృప్తిగా ఉన్నారనే చర్చ నడుస్తోంది. గతంలో 33 వేల ఎకరాలు సేకరించినా వారికి చెప్పుకోదగ్గ ప్రయోజనం చేకూర్చకుండా, ఇప్పుడు మరో 44 వేల ఎకరాల సేకరణ చేపట్టడం పట్ల అమరావతి రైతులు ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు.
అమరావతి రైతులు మాత్రమే కాకుండా, ఒక బలమైన సామాజిక వర్గం కూడా ఈ విషయంలో అసంతృప్తితో ఉందని అంటున్నారు. అంతా అమరావతికే ప్రాధాన్యత ఇస్తే తమ ప్రత్యేకత ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయంలోనే బాబు సర్కార్‌పై విమర్శలు వస్తున్నాయని చెబుతున్నారు. అంతేకాకుండా, కేంద్రంలో బీజేపీ పాలనా విధానాలకు చంద్రబాబు బేషరతుగా మద్దతు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో టీడీపీ పూర్తిగా నష్టపోతుందని ఒక సామాజిక వర్గంలో చర్చ సాగుతోంది.
అదేవిధంగా, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆ సామాజిక వర్గం ప్రయోజనాలు గతంలో మాదిరిగా పెద్దగా నెరవేరడం లేదని చెబుతున్నారు. కూటమి పాలన బాబు మార్కుకు భిన్నంగా సాగుతోందని అంటున్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అప్పులు చేయడం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని విశ్లేషిస్తున్నారు. మరోవైపు, పోలవరం ఎత్తు తగ్గించడం వంటి అంశాలు కూడా చర్చకు వస్తున్నాయని చెబుతున్నారు. మొత్తంగా, కూటమి పాలనలో చంద్రబాబు ముద్ర లేకపోవడంతోనే ఒక కీలక సామాజిక వర్గంలో అసంతృప్తి మొదలైందని అంటున్నారు.