వేంపల్లె (తెలుగుప్రభ) : రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) విద్యార్థులు జాతీయ స్థాయిలో మరో ఘనత సాధించారు. ఆర్కే వ్యాలీ యోగా అండ్ వెల్‌నెస్ విభాగం ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఆర్కే వ్యాలీకి చెందిన ఐదుగురు, ఒంగోలు క్యాంపస్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు కలిపి మొత్తం ఎనిమిది మంది కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని యోగా సర్టిఫికేషన్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులై యోగ వెల్‌నెస్ ఇన్‌స్ట్రక్టర్ జాతీయ స్థాయి ధృవీకరణ పత్రాన్ని పొందినట్లు యోగా అధ్యాపకుడు సోమేపల్లి అశోక్ తెలిపారు.
యోగా విద్యను నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య పరిరక్షణ, ఉపాధి అవకాశాలతో అనుసంధానిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దడంలో యోగా విభాగం చేస్తున్న కృషికి ఈ విజయం నిదర్శనమని డీన్ ఆఫ్ అకడమిక్స్ డి. రమేశ్ తెలిపారు. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి యోగా ధృవీకరణలు సాధించి విశ్వవిద్యాలయానికి మరింత కీర్తి తీసుకురావాలని డైరెక్టర్ ప్రొఫెసర్ జి. విజయ ప్రకాష్ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఆర్జియుకేటి డైరెక్టర్ ప్రొఫెసర్ జి. విజయ్ ప్రకాష్, పరిపాలనాధికారి డా. పి. రవికుమార్, డీన్ ఆఫ్ అకాడమిక్స్ డి. రమేశ్, డా. రూపస్ కుమార్, డీన్ ఆఫ్ స్టూడెంట్ వెల్ఫేర్ డా. జి. వెంకటేశ్, ఆర్థిక అధికారి జి. రమేశ్ తదితరులు విజేతలను అభినందించారు. ధృవీకరణ పత్రం పొందిన వారిలో ఆర్‌కే వ్యాలీ విద్యార్థులు భూమా నాగ పవన్, భూమిరెడ్డి సారథి, మోచర్ల వర్ష, పూజారి రెడ్డి భారతి, జుటూరు ప్రవల్లిక, ఒంగోలు క్యాంపస్ విద్యార్థులు షేక్ సిద్ధ సాయిబాబా, కడవకల్లు సాయికుమార్, కుసుమంచి శ్రీ హర్షల్ ఉన్నారు.

