రామోజీ రావు మరణంపట్ల రాజకీయ, సినీ ప్రముఖులంతా దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈమేరకు సంతాపం వ్యక్తంచేశారు.
తెలుగు పత్రికా రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందారు రామోజీ రావు. తెలుగులోనే కాదు దేశ పత్రికా రంగంలోనే ఓ కొత్త ఒరవడిని సృష్టించి భావితరాల పత్రికా ప్రతినిధులకు మార్గదర్శి గా నిలిచారు. తెలుగు నుడికారానికి ఒక కొత్త కళను తెచ్చారు. జర్నలిజానికి కొత్త సొబగును దిద్దారు. చిత్ర సీమలో అదే తీరున సాగి ఉషోదయ కిరణాలను ప్రసరింప చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియో గా రామోజీ ఫిలిం సిటీని తెలుగు నేలపై నెలకొల్పారు. ఏది చేసినా తనదైన బాణీ కల్పిస్తూ సాగిన రామోజీరావు ఇక లేరు అన్న వార్త ఆవేదన కలిగిస్తోంది. మా తండ్రిగారు నందమూరి తారక రామారావు గారితో ఆయన అనుబంధం ప్రత్యేకమైనది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. అంటూ బాలయ్య ప్రకటన విడుదల చేశారు.