RK Roja Slams Janasena:ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను అస్త్రంగా చేసుకుని మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
నగరి వీధుల్లో నిరసన జ్వాల
రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళా ఉద్యోగిని వేధించారనే ఆరోపణల నేపథ్యంలో, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నగరిలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. నగరిలోని ఏ.జె.ఎస్ కళ్యాణ మండపం నుంచి ఓం శక్తి ఆలయం వరకు రోజా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో రోజాతో పాటు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి , ఇతర వైకాపా శ్రేణులు పాల్గొన్నారు.
Also Read: AP Cabinet – వైసీపీ దుష్ప్రచారంపై చంద్రబాబు సర్కార్ సీరియస్.
‘కామ సేన’ అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు
నిరసన సందర్భంగా రోజా మాట్లాడుతూ జనసేన పార్టీపై నిప్పులు చెరిగారు. “జనసేన అంటే జనసేన కాదు.. అది ‘కామ సేన’.. కామాంధుల సేన” అంటూ ఘాటు విమర్శలు చేశారు. క్యారెక్టర్ లేని వ్యక్తులకు రాజకీయాల్లో చోటు కల్పిస్తే సామాన్యులకు రక్షణ ఉండదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
“మహిళలకు అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. తక్షణమే ఆ ‘కీచక’ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడలేని హోంమంత్రిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు.
బాధితురాలికి మద్దతుగా..
రైల్వేకోడూరులో జరిగిన ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, బాధితురాలికి భరోసా కల్పించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ వివాదంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

