RK Roja : వైసీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నగరిలో మీడియాతో మాట్లాడిన ఆమె, పవన్‌కు ప్రజలు ఓట్లేసింది సినిమా షూటింగ్‌లు చేసుకోవడానికా, ప్రభుత్వ విమానాల్లో తిరగడానికా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు యూరియా అందక ఇబ్బందులు పడుతున్నా పవన్ పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు.
పవన్‌కు రోజా ప్రశ్నలు
కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై సీఎం చంద్రబాబును నిలదీయాలని, కానీ పవన్ చంద్రబాబు కొనిచ్చిన హెలికాప్టర్‌లో షికార్లు కొడుతున్నారని రోజా ఆరోపించారు. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తుంటే పవన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రజలు ఇప్పుడు పవన్‌కు ఓట్లు వేసి తప్పు చేశామని బాధపడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
హోంమంత్రి అనితపై రోజా సెటైర్లు
హోంమంత్రి వంగలపూడి అనితపైనా ఆర్కే రోజా సెటైర్లు వేశారు. “అనిత యాంకరా.. హోం మంత్రా?” అంటూ ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రోజా మండిపడ్డారు. వైసీపీ హయాంలో నిర్మించిన 7 మెడికల్ కాలేజీల్లో 5 కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయని ఆమె గుర్తు చేశారు. మిగిలిన కాలేజీల నిర్మాణాలను నిధులు కేటాయించకుండా కక్షపూరితంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
“వారానికి ఒకసారి హైదరాబాద్ AIGకి వెళ్లి ఎవరు మందులు వేసుకుంటారో అందరికీ తెలుసు” అంటూ చంద్రబాబుపై పరోక్షంగా విమర్శలు చేశారు. మెడికల్ కాలేజీల పరిస్థితిని పరిశీలించడానికి సిద్ధంగా ఉంటే, రాజమండ్రి, విజయనగరం, మచిలీపట్నం, నంద్యాల, పాడేరు మెడికల్ కాలేజీలను చూపించడానికి సిద్ధంగా ఉన్నానని రోజా వంగలపూడి అనితకు సవాల్ విసిరారు.


