Road Accident : నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం మధ్యాహ్నాం మోచర్ల వద్ద జాతీయ రహదారి పనుల్లో కార్మికులు నిమగ్నమై ఉన్నారు. ఈ సమయంలో ఓ లారీ వేగంగా దూసుకువచ్చి పనులు చేస్తున్న కార్మికులపైకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ముగ్గరు కార్మికులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. మరో వ్యక్తిని మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. బాధితులను చాగల్లు, సింగరాయకొండ, మన్నేటికోట వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెలుతున్న రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు గమనించి ఆగిపోయారు. క్షతగాత్రులను తరలించేందుకు చర్యలు చేపట్టారు. మోచర్ల వద్ద అధికంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇక్కడ ఫ్లై ఓవర్ నిర్మాణం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతానని ఆయన హామీ ఇచ్చారు.