Road accident: తిరుపతి(Tirupati)లో రోడ్డు ప్రమాదం జరిగింది. నాయుడుపేట- పూత్తలపట్టు రహదారిలోని తిరుపతి రూరల్ గొల్లపల్లి సమీపంలో ముందు వెళుతున్న బుల్డోజర్‌ను వెనుక వైపు నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జు అయింది. ఇక ఈ ఘటనలో 20 నుంచి 30 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచాం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన క్షత్రగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఆర్టీసీ బస్సును చిత్తూరు-2 డిపోకు చెందినదిగా గుర్తించారు.
ఈ ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాదంలో తీవ్ర గాయాలైన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులతో పాటు రుయా ఆస్పత్రి సిబ్బందికి సూచించారు. అలాగే తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.