Wednesday, July 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Jagan: జగన్ కారును తనిఖీ చేసిన అధికారులు

Jagan: జగన్ కారును తనిఖీ చేసిన అధికారులు

Jagan car: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును పోలీసులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీ 40 డీహెచ్ 2349 రిజిస్ట్రేషన్ నంబరు గల ఈ కారు జిల్లా పోలీసు కార్యాలయంలో ఉంది. తాజాగా ఈ కారును రవాణాశాఖ అధికారులు తనిఖీ చేశారు. మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ గంగాధర ప్రసాద్ నేతృత్వంలోని బృందం కారు టెక్నికల్ కండిషన్, ఫిట్‌నెస్‌ను క్షుణ్ణంగా పరిశీలించింది.

కాగా ఇటీవల పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో భాగంగా జగన్ కారు చక్రాల కింద పడి సింగయ్య అనే వ్యక్తి దురదృష్టవశాత్తు మృతి చెందిన విషయం విధితమే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో జగన్ తో పాటు ఆయన కారు డ్రైవర్ రమణారెడ్డి, వ్యక్తిగత సహాయకుడు నాగేశ్వర్‌ రెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజినీని నిందితులుగా చేర్చుతూ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇప్పటికే జగన్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ ప్రమాదానికి కారణమైన జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును పోలీసులు సీజ్ చేశారు. దీనిపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం కారు కండిషన్ గురించి తెలుసుకునేందుకే సీజ్ చేశామని చెబుతున్నారు. తాజాగా కారును అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల అనంతరం కారును పోలీసు కార్యాలయంలోనే ఉంచారు.

ఇదిలా ఉంటే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన క్రిమినల్ కేసును కొట్టివేయాలంటూ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. పిటిషన్‌పై జస్టిస్ వై. లక్ష్మణరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం కౌంటర్ కు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ సమయం కోరారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం జులై 1వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News