నల్లమల అటవీ ప్రాంతం నుండి ఈసారైనా వెదురు సేకరణ జరిగేనా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వెదురు సేకరించడంలో అధికారులు నిర్లక్ష్య ధోరణిలో జాప్యం చేస్తుండడంతో అటు ప్రభుత్వ ఆదాయానికి గండిపడటమే కాకుండా ఇటు వెదురు సేకరణపై ఆధారపడి జీవనం సాగించే వందలాది మంది కూలీలు ఉపాధి కోల్పోతున్నారు. అటవీశాఖ నంద్యాల డివిజన్ పరిధిలోని రుద్రవరం గాజులపల్లె డిపోలలో వెదురు సేకరణ నిలిచిపోవడంతో డిపోలు వెలవెలబోతున్నాయి.
రుద్రవరం రేంజ్ లోని చిలమానుపెంట, గొర్రె గుంత, మామిడి మాను చలమా, అహోబిలం కూపులలో గల అటవీ ప్రాంతం నుండి అలాగే గాజులపల్లె డిపోకు సంబంధించి చెలిమ రేంజ్ పరిధిలోని ఆయా కూపుల నుండి వెదురు సేకరణ సేకరించాల్సి ఉంటుంది. మొదటి విడత గత ఏడాది సెప్టెంబర్ నెల నుండి ఏడాది మార్చి నెల చివరి వరకు అటవీ ప్రాంతం నుండి వెదురు సేకరణ సేకరించాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా వెదురు సేకరణ నిలిచిపోయింది. దీంతో వందలాది మంది కూలీలు ఉపాధి కోల్పోయారు. రెండో విడత ఏప్రిల్ నెల నుండి జూన్ నెల చివరి వరకు వెదురు సేకరణ సేకరించాల్సి ఉంది. రెండు విడతలుగా అటవీ ప్రాంతం నుండి వెదురు సేకరణ చేపట్టడం ద్వారా అటు ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు ఇటు కూలీలకు జీవనోపాధి కల్పించడం జరుగుతుండేది. రెండు రేంజిల పరిధిలోని అటవీ ప్రాంతం నుండి వెదురు సేకరణలో అధికారులు జాప్యం చేస్తూ వెదురు సేకరణ ప్రారంభించ లేకపోవడంతో కూలీలు జీవనోపాధి కోల్పోతున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి ఈసారైనా రెండవ విడతైనా వెదురు సేకరణ ప్రారంభించి కూలీలకు ఉపాధి కల్పిస్తారా లేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వెదురు సేకరణ ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారా అని వెదురు సేకరణపై ఆధారపడి జీవించే వందలాది మంది కూలీలు ఎదురుచూస్తున్నారు.
వెదురు సేకరణ ప్రారంభించేందుకు ఉన్నతాధికారుల అనుమతి కోరామని నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వెదురు సేకరణ ప్రారంభిస్తామని రుద్రవరం రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు తెలిపారు. రెండో విడత వెదురు సేకరించేందుకు నివేదికలు ఉన్నతాధికారులకు పంపినట్టు, అమరావతి నుండి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే టెండర్లు పిలిచి వెదురు సేకరణ ప్రారంభిస్తామన్నారు.