మరో అమర్‌నాథ్‌గా భక్తుల నమ్మకం.. ఏడాదిలో మూడు రోజులే దర్శనానికి అవకాశం.. రాకపోకలకు కాలిబాటే దిక్కు.. ఏప్రిల్ 1, 2, 3 తేదీల్లో జాతర
Saleshwaram Temple: సలేశ్వరం.. నల్లమలలోని ఓ దివ్య క్షేత్రం. చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులను రప్పించుకుంటున్న ఓ అద్భుత తీర్థం. నింగి నుండి నేలకు జాలువారుతున్నదా అనిపించే సెలయేరు.. అక్కడక్కడా చెంచుల ఆవాసాలు, మండువేసవిలో తప్పక దర్శించి తీరాల్సిన ఒక మధుర దివ్యధామం. తెలంగాణ అమర్‌నాథ్ యాత్రగా పేరున్న ఈ సలేశ్వరానికి ఏడాదిలో మూడు రోజులు మాత్రమే దర్శనానికి అవకాశం ఉండటం గమనార్హం.
శైలం అంటే కొండ. కొండ దిగువన ఈశ్వరుడు కొలువుదీరినందున దీన్ని శైలేశ్వరమని, వాడుకలో సలేశ్వరమని పిలుస్తారు. సెల అంటే జలపాతం (కొండవాగు)అని కూడా అంటారు. ఈ జలపాతం వద్దే శివుడి ఆవాసమున్నందున సలేశ్వరం అని కూడా అంటారని పండితులు చెబుతారు.
లోయలో రెండు కి.మీ. దిగితే సలేశ్వరుడి దర్శనం
సలేశ్వరుడి దర్శనం కోసం నల్లమల అడవుల్లోని లోయలో 2 కిలోమీటర్లు కిందికి దిగాల్సి ఉంటుంది. ఈ దారిలో ఒకరు నడవడానికే అవకాశం ఉంటుంది. దిగే సమయంలో ఏ మాత్రం కాలు దొణికినా, జారినా కిందపడిపోవడం ఖాయం. అందుకని చేతి కర్రలు తెచ్చుకుంటారు చాలా మంది. భక్తుల రాకపోకలను నియంత్రించేందుకు తొక్కిసలాట జరగకుండా నివారించేందుకు చెంచు వలంటీర్లు ఉంటారు. సలేశ్వరుడి దర్శనానికి కేవలం భక్తి ఉంటే సరిపోదు.. శివుడి దయ కూడా ఉండాలంటారు. దారిపొడవునా వన్యప్రాణుల బెడద ఉండొచ్చు. అందుకని చేతిలో కర్ర తప్పనిసరి అంటుంటారు. పైగా లోయలో కిందికి దిగడమనేది ధైర్యం, సాహసంతో కూడిన ప్రక్రియగా కూడా చెప్పొచ్చు.
వస్తున్నాం లింగమయ్య..
ఇక్కడి లోయలో స్వామికి ఎదురుగా 300 అడుగుల ఎత్తునుండి జలపాతం జాలువారుతుంది. ఆ నీరు గుండంలోకి చేరుతుంది. భక్తులు ఆ గుండంలో స్నానం చేసి తడి దుస్తులతోనే గుండం పక్కనే మెట్లు ఎక్కి లింగమయ్యను దర్శించుకుంటారు. అవే తడిబట్టలతో లోయనుంచి పైకి వస్తారు. సలేశ్వరానికి వచ్చే భక్తులు దారి పొడవునా.. ‘‘నీ దర్శనానికి వస్తున్నాం లింగమయ్య’’ అని చెప్పుకుంటూ వస్తుంటారు. దర్శనం అనంతరం.. ‘‘వెళ్ళొస్తాం లింగమయ్య’’ అని చెప్పుకుంటూ బయల్దేరుతారు. ఈ లోయలో పగలు సైతం చిమ్మచీకటిగానే ఉంటుంది. అందువల్ల జనరేటర్ సాయంతో లైటింగ్ ఏర్పాటు చేస్తారు.
వీరభద్రుడి దర్శనం తర్వాతే..
సలేశ్వరం క్షేత్రంలో నీరు పారే పైభాగాన్ని పుష్కర తీర్థమని మిగతా ప్రాంతాన్ని సర్వేశ్వర తీర్థంగా చెబుతుంటారు. ఈ తీర్ధానికి పడమర వైపు 10 అడుగుల ఎత్తులో ఉన్న గుహాలయమే శనైశ్చరాలయం. ఇక్కడున్న గర్భాలయ ముఖ మండపాలకు మధ్యగల గోడను చరిత్రకారులు పరిశీలించి క్రీ.శ. 6-7 శతాబ్దాలకు చెందినదిగా నిర్ధారించారు. ఆలయం కుడి వైపున మూడు అడుగుల వీరభద్రుడి విగ్రహం ఉంది. ఈ వీరభద్రుడే సలేశ్వర క్షేత్రానికి క్షేత్రపాలకుడు. ముందుగా వీరభద్రుడిని దర్శనం చేసుకొని తరువాత సలేశ్వరుడిని దర్శనం చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీ.
ప్రతి చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా మూడు రోజుల పాటు జాతర జరుగుతుంది. ఏప్రిల్ 1, 2, 3 తేదీల్లో జరిగే ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.
ఎలా వెళ్లాలంటే…
నాగర్ కర్నూలు జిల్లాలోని లింగాల మండలం అప్పాపూర్ చెంచుపెంట గ్రామపంచాయతీ పరిధిలో గల నల్లమల అడవుల్లోని లోయల మధ్య కొలువుదీరింది ఈ సలేశ్వరం. శ్రీశైలం క్షేత్రానికి 28 కి.మీ.దూరంలో ఉంటుంది. అభయారణ్యం అయినందున, వన్యప్రాణులకు హాని కలుగకుండా, అడవికి నష్టం వాటిల్లకుండా అటవీశాఖ అధికారులు పలు ఆంక్షలతో ఈ జాతరకు అనుమతించారు. ఈ మూడు రోజుల్లో మాత్రమే జనం రావడానికి అవకాశం ఉంటుంది. నల్లమల అడవులు కాబట్టి సలేశ్వరం క్షేత్రానికి రోడ్డు నిర్మాణం జరగలేదు. సలేశ్వర క్షేత్రానికి వెళ్లేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. లింగాల మండల కేంద్రం నుండి అప్పాయి పల్లి మీదుగా గిరిజగుండాల వరకు ప్రైవేటు వాహనాలు నడుస్తాయి. అక్కడి నుంచి సుమారు 8కి.మీ. పొడవునా రాళ్లు, రప్పలతో కూడిన కాలిబాట ఉంటుంది. మరో దారి.. హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిలో మన్ననూరు నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరహాబాద్ గేట్ నుండి లోపలికి వెళ్లేందుకు ఉంటుంది. ఈ దారిలో రాంపూర్ నుండి వాహనాలు కొద్దిదూరం వెళ్లాక వాహనాలు ఆగిపోతాయి. అక్కడి నుండి లోయలోకి దిగుతూ సుమారు 5 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది.
నీరు, భోజనం సదుపాయం
ఈ క్షేత్రానికి వచ్చే వారి కోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలు దారి పొడవునా తాగునీటి వసతి, భోజనం సౌకర్యం కల్పిస్తారు. ఎవరికి వారు తాగేందుకు నీరు, చిరు ఆహారం వెంట తీసుకెళ్లడం శ్రేయస్కరం. వయస్సు, లింగ భేదం లేకుండా, పగలు, రాత్రి తేడా లేకుండా ఈ మూడు రోజుల పాటు భక్తులు క్షేత్రానికి వస్తూనే ఉంటారు. దట్టమైన అడవిలో ఉన్న ఈ క్షేత్రంలో చెంచులే పూజారులు. వారే వలంటీర్లుగా పని చేస్తారు. భక్తులకు అవసరమైతే సహయ సహకారాలు అందిస్తారు.
– ఉమాశంకర్ హౌదేకార్,
తెలుగుప్రభ నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి

