తన మాతృభాష మరాఠీ అయినా.. తెలుగులోనే చదువుకున్నానని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Sathya Kumar Yadav) తెలిపారు. విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఆయన మాట్లాడారు. మాతృభాష నేర్చుకున్న పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుందన్నారు. తన పిల్లలను తెలుగులోనే చదివిస్తున్నానని పేర్కొన్నారు. సంస్కృతి, వారసత్వం, పండుగలు అన్నీ భాషతోనే ముడిపడి ఉంటాయన్నారు. తల్లిదండ్రుల చొరవతోనే మాతృభాష మనుగడ సాధ్యపడుతుందని సూచించారు.
పసిబిడ్డలు తమకు తెలియకుండానే అనుకరణ ద్వారా, చుట్టూ ఉన్న వాళ్లను గమనించడం ద్వారా భాషను నేర్చుకుంటారని తెలిపారు. మాతృభాషతో మమేకం అయి ముందుకు సాగడం వల్ల తెలివితేటలు కూడా పెరుగుతాయన్నారు. తన మాతృభాష మరాఠీ అని ఎప్పుడో 400 ఏళ్ల కిందట మహారాష్ట్రలోని శంభాజీ సంస్థానానికి చెందిన సైనికులు విస్తరణలో భాగంగా తంజావూరు వరకు వలసలు వెళ్లారని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తమ కుటుంబం కూడా మహారాష్ట్ర నుంచి వచ్చి ఏపీలో ఆగిపోయిందన్నారు. చిన్నప్పటి నుంచి మా అమ్మ తెలుగులోనే మాట్లాడడంతో తాను కూడా తెలుగు నేర్చుకున్నానని వెల్లడించారు.