Sathya Sai Centenary High Court Judgement : పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు రాష్ట్ర వేడుకగా నిర్వహించాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. నవంబర్ 23న జరిగే ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరు కావాలని శ్రీ సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఆహ్వానాలు పంపారు. మోదీ కూడా హాజరు కానున్నారు. కానీ, లౌకిక దేశంలో ప్రభుత్వ నిధులతో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడం తప్పు అని ఒంగోలుకు చెందిన భారత హేతువాద సంఘం అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషనర్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.
ALSO READ: Suriya: మరో తెలుగు దర్శకుడికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సూర్య – దిల్‌రాజు బ్యానర్‌లో మూవీ
జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ల వద్ద విచారణలో, “సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు ప్రభుత్వం నిర్వహిస్తే తప్పేముంది? ఆయన ట్రస్ట్ ద్వారా మూడు జిల్లాలకు తాగునీరు అందించారు. ఆసుపత్రులు, విద్యాసంస్థలు స్థాపించి ప్రజలకు సేవ చేశారు. ఇలాంటి విశిష్ట వ్యక్తి సేవలను గౌరవించడంలో ఏముంది?” అని పిటిషనర్‌ను సూటిగా ప్రశ్నించారు. పిల్‌ను వెంటనే వాపసు తీసుకోవాలని ఆదేశించి, లేకపోతే ఖర్చులు విధించి వ్యాజ్యాన్ని కొట్టివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. “ప్రజా ప్రయోజనం లేని వ్యాజ్యాలపై దృష్టి పెట్టకుండా, నిజమైన సమస్యలపై దృష్టి సారించాలి” అని హైకోర్టు హితవు పలికింది.
పిటిషనర్ తరఫున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్, “లౌకిక రాజ్యంలో మతపరమైన కార్యక్రమాలకు ప్రభుత్వ నిధులు వాడటం రాజ్యాంగ విరుద్ధం” అని వాదించారు. దీనికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్. ప్రణతి కౌంటర్ ఇచ్చారు. “సత్యసాయి బాబా సేవలు పరిగణనలోకి తీసుకుని, 22 మంది విశిష్ట వ్యక్తుల జయంతులను అధికారికంగా నిర్వహిస్తున్నాము. ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో సామాజిక సేవలు అందుతున్నాయి” అని వివరించారు. జస్టిస్ ఠాకూర్, “సరైన అధ్యయనం చేయకుండా ప్రభుత్వ ఉత్తర్వులు ఎలా జారీ చేస్తుందని పిటిషనర్‌ను ప్రశ్నించారు.
శ్రీ సత్యసాయి బాబా (1926-2011) పుట్టపర్తి ఆశ్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సేవలు అందించారు. అన్నదానం, ఉచిత వైద్యం, విద్య, తాగునీరు ప్రాజెక్టులు (రూ.2,000 కోట్లు ఖర్చు) ద్వారా లక్షలాది మందికి ప్రయోజనం. ఏపీ, తెలంగాణలో ఆయన సేవలు గుర్తుంచుకుని ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తోంది. హైకోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా మారాయి. పిటిషనర్ పిల్ వాపసు తీసుకుంటారా? లేదా హైకోర్టు ఖర్చులు విధిస్తుందా? ఆసక్తికరంగా మారింది.


