టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) వ్యాఖ్యలపై మంత్రి సత్య కుమార్ యాదవ్(Satya Kumar Yadav) కౌంటర్ ఇచ్చారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. ప్రభాకర్ రెడ్డి వయసుకు తగినట్లుగా మాట్లాడాలని సూచించారు. ఆయన వ్యక్తిగత సమస్యలు తీసుకువచ్చి రాష్ట్ర సమస్యలాగా మాట్లాడకూడదని హితవు పలికారు.
మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పుకొచ్చారు. ఎక్కడో బస్సు కాలితే బీజేపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు. గతంలో ప్రభాకర్ రెడ్డి బస్సులు , వ్యాపారాలపై,అనేక ఆరోపణలు ఉన్నాయని.. అయితే వాటి గురించి తాను మాట్లాడనని తెలిపారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ గురించి ఎలా పడితే అలా మాట్లాడటం సమంజసం కాదన్నారు. బీజేపీ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ అన్నారు.
కాగా అనంతపురంలో దివాకర్ ట్రావెల్స్ బస్సులు దగ్ధమైన ఘటనపై జేసీ మాట్లాడుతూ..బీజేపీ నేతలే తమ బస్సులను తగలబెట్టించారని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ నేతల కంటే హిజ్రాలు నయమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా బీజేపీ మహిళా నేత, సినీ నటి మాధవీలతకు ప్రాసిట్యూట్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.