Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్SC commission: ఏపీజెన్‌కో పనితీరు అద్భుతం

SC commission: ఏపీజెన్‌కో పనితీరు అద్భుతం

రాష్ట్రపతికి సిఫార్సు చేస్తా

రిజర్వేషన్ల అమలు, ఉద్యోగుల సంక్షేమం విషయంలో ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ (ఏపీజెన్‌కో) పనితీరు అద్భుతంగా ఉందని మాజీ ఎంపీ, జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యురాలు డాక్టర్‌ అంజుబాల ప్రశంసించారు. యాజమాన్యం తీరును అభినందిస్తూ ఏపీజెన్‌కో మేనేజింగ్‌ డైరెక్టర్‌కు ప్రశంసాపత్రం పంపడంతోపాటు, కమిషన్‌ తరఫున రాష్ట్రపతికి కూడా సిఫార్సు చేస్తామని ఉన్నతాధికారుల హర్షధ్వానాల మధ్య ఆమె ప్రకటించారు. ఏపీ జెన్‌కో కార్యాలయంలో శుక్రవారం ఆమె కమిషన్‌ అధికారులతో కలిసి ఎస్సీ అసోసియేషన్ల ఉద్యోగులతో సమావేశమై ప్రత్యేకంగా చర్చించారు. వారి నుంచి వినతిపత్రాలు/ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం రిజర్వేషన్ల అమలుతీరు, ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం తీసుకుంటున్న చర్యలు, అసోసియేషన్ల నుంచి వచ్చిన వినతులు, ఇతర అంశాలపై ఏపీజెన్‌కో ఉన్నతాధికారులతో సమీక్షించారు. తమతో ఏపీజెన్‌కో యాజమాన్యం అన్నివిధాలా సహృద్భావంతో, ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తోందంటూ ఎస్సీ అసోసియేషన్లు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాయని అంజుబాల ప్రశంసించారు. కేవలం నాలుగు డిమాండ్లతో కూడిన వినతిపత్రాలు ఇచ్చారని, మిగిలిన అన్ని అంశాలపై యాజమాన్యం తీరును ఎస్సీ అసోసియేషన్లు తమ వద్ద ప్రశంసించాయని ఆమె వివరించారు. తాను మొదటిసారి ఎన్నికైన ఎంపీనైనప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రోత్సహించి తొమ్మిది పార్లమెంటరీ కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించడమే కాకుండా విప్‌ బాధ్యత కూడా ఇవ్వడం తన అదృష్టమని ఆమె గుర్తుచేశారు.

- Advertisement -


ప్రతి నెలా ఒకసారి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ‘చాయ్‌ పే చర్చా సమావేశం’ ఏర్పాటుచేసుకుని చిన్న చిన్న సమస్యలు ఉంటే నవ్వుతూ చర్చించుకుని పరిష్కరించుకోవాలని, నవ్వు నాలుగు విధాల మేలని అంజుబాల సూచించారు. చర్చల్లో పరిష్కారంకాని సమస్యలనే కమిషన్‌ దృష్టికి తేవాలని అసోసియేషన్ల వారికి కూడా తాను సూచించాని తెలిపారు.

పెట్టుబడుల్లో అగ్రస్థానం : ఎండీ చక్రధర్‌ బాబు
గతంలో ఎన్నడూ లేనంతగా ఈ వేసవిలో రోజువారీ డిమాండు 263 మిలియన్‌ యూనిట్లకు పెరిగినప్పటికీ సుదీర్ఘ అనుభవంగల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గదర్శకం, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సహాయ సహకారాలవల్లే ఎలాంటి కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ అందించగలిగామని జెన్‌కో ఎండీ చక్రధర్‌ బాబు తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ అగ్రభాగంలో ఉందని, విశాఖలో జరిగిన ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌లో రాష్ట్రంలో రూ. 9 లక్షల కోట్ల పెట్టుబడులు ఇంధన రంగంలో పెట్టేందుకు వివిధ సంస్థలు ఎంఓయూలు కుదుర్చుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దూరదృష్టిగల ఉత్సాహవంతులైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలో పెరుగుతున్న రాష్ట్ర విద్యుత్‌ అవసరాలు తీర్చేందుకు ఏపీజెన్‌కో సామర్థ్యం పెంపు దిశగా ప్రణాళికాబద్దంగా ముందుకెళుతున్నామని తెలిపారు.

నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ)తో కలిసి పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్లాన్‌ చేస్తున్నామని వివరించారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం అమల్లోనూ, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి కార్యాచరణ ప్రణాళిక విషయంలోనూ ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ఉద్యోగులు, యాజమాన్యం అంతా ఒక కుటుంబ సభ్యుల్లా కలిసి కూర్చుని చర్చించి ఉమ్మడి నిర్ణయాలు తీసుకుంటున్నందున ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని వివరించారు. జాతీయ ఎస్సీ కమిషన్‌ (దక్షిణ రాష్ట్రాల) డైరెక్టర్‌ డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ బాబు, ఏపీ జెన్‌కో మానవ వనరుల విభాగం డైరెక్టర్‌ సయ్యద్‌ రఫి, సీజీఎం గౌరీపతి ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యురాలు అంజుబాలతోపాటు అధికారులను ఏపీజెన్‌కో ఎండీ చక్రధర్‌ బాబు జ్ఞాపికలతో సత్కరించారు. అంతకు ముందు ఏపీ జెన్‌కో ప్రాంగణంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అంజుబాల, సునీల్‌ కుమార్‌ బాబు తమ పర్యటనకు, పర్యావరణ పరిరక్షణకు గుర్తుగా మొక్కలు నాటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News