ప్రముఖ అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం(Rajagopala Chidambaram) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం ముంబైలోని జస్‌లోక్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) సంతాపం తెలియజేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
“భారతదేశ అణుశక్తి విభాగానికి నాయకత్వం వహించి ఆయుధ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం గారి మరణం విచారకరం. దేశం నిర్వహించిన రెండు అణు పరీక్షలలో చిదంబరం గారి పాత్ర చిరస్మరణీయం. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ… వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను.” అని పేర్కొన్నారు.
కాగా చెన్నైలో జన్మించిన రాజగోపాల చిదంబరం.. మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌తో బీఎస్సీ పూర్తి చేశారు. 1962లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి పీహెచ్‌డీ సాధించారు. 1974లో జరిపిన పోఖ్రాన్ 1 (ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ), 1998లో నిర్వహించిన పోఖ్రాన్ 2 (ఆపరేషన్ శక్తి) అణు పరీక్షల్లో కీలకంగా పనిచేశారు. ఈ రెండు పరీక్షల్లో పాలుపంచుకొన్న అణు శాస్త్రవేత్తగా రాజగోపాల చిదంబరం అరుదైన ఘనత సాధించారు.