Searching For Sea Spewing Beads Of Gold In Uppada Beach: ఏపీపై మొంథా తుఫాను విరుచుకుపడుతోంది. తీర ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే, ఓ వైపు తుఫాను విలయతాండవం చేస్తుంటే.. మరోవైపు, కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీరం వైపు స్థానిక ప్రజలు పరుగులు పెడుతున్నారు. బంగారం కొట్టుకొస్తుందన్న వదంతుల నేపథ్యంలో తుఫాను హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా ప్రజలు పెద్ద ఎత్తున ఉప్పాడ తీరం వైపు వస్తున్నారు. అయితే, తుఫాను బీభత్సం తగ్గిన తర్వాత.. తీరం వెంబడి టన్నుల కొద్దీ బంగారం కొట్టుకువస్తుందనే నమ్మకంతో స్థానికులు, ప్రజలు ఇలా పెద్ద ఎత్తున ఉప్పాడ వైపు పరుగులు తీస్తున్నారు. స్థానిక సమాచారం ప్రకారం, బలమైన గాలులు, భారీ అలల కారణంగా సముద్ర గర్భంలో పేరుకుపోయిన వస్తువులు ఒడ్డుకు కొట్టుకువస్తున్నాయని, అందులో బంగారు ముక్కలు కూడా ఉన్నాయని బలంగా విశ్వసిస్తున్నారు. తీర ప్రాంతంలో నివసించే కొందరు స్థానికులు ఇప్పటికే తమకు కొన్ని చిన్న చిన్న బంగారు ముక్కలు లేదా గవ్వలు, రాళ్ల మధ్య కలిసిపోయిన బంగారు రేణువులు దొరికాయని చెప్పుకుంటున్నారు. గతంలోనూ ఇక్కడ బంగారం దొరికిందని, ఇప్పుడు కూడా దొరికే అవకాశం ఉందని స్థానికులు విశ్వసిస్తున్నారు. బంగారం కోసం హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా అత్యంత ప్రమాదకర స్థితిలో వేట కొనసాగిస్తున్నారు.
టన్నుల కొద్దీ బంగారం ఉందన్న వదంతులు..
ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాలకు సైతం పాకడంతో, ఉప్పాడ తీరం వద్ద సందడి వాతావరణం నెలకొంది. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించిన వందలాది మంది ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరం వెంబడి గాలిస్తున్నారు. సముద్రపు ఇసుకను జల్లెడ పట్టడానికి, రాళ్ల సందుల్లో వెతకడానికి తాపత్రయ పడుతున్నారు. ఈ నమ్మకానికి చారిత్రక లేదా శాస్త్రీయ ఆధారం ఏమీ లేనప్పటికీ.. తుఫానుల సమయంలో సముద్రపు అడుగు భాగం కదిలి.. అరుదైన వస్తువులు ఒడ్డుకు వస్తాయనే భావన స్థానికులలో బలంగా ఉంది. గతంలో వచ్చిన కొన్ని తుఫానుల తర్వాత కూడా ఈ విధంగా ప్రజలు తీరానికి చేరుకుని గాలించిన దాఖలాలు ఉన్నాయి. బంగారం దొరికిందన్న వదంతుల నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్న రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు ఉప్పాడకు భారీగా చేరుకుంటున్నారు. దీంతో తీరం వద్ద అసాధారణ స్థాయిలో జనసమూహం కనిపిస్తోంది. పోలీసులు, ప్రభుత్వ అధికారులు ఈ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. తీరం వద్ద తొక్కిసలాట జరగకుండా.. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులు భావిస్తున్నారు. నిజంగానే టన్నుల కొద్దీ బంగారం దొరుకుతుందా? లేక ఇది కేవలం అపోహగా మిగిలిపోతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, మరో వైపు టన్నుల కొద్దీ బంగారం కొట్టుకువస్తుందనే వార్త కేవలం పుకారు మాత్రమేనని, ప్రజలు ఇలాంటి వదంతులు నమ్మవద్దని పోలీసులు, రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు తీరం వద్దకు రావడం ప్రమాదకరం అని సూచించినప్పటికీ.. హెచ్చరికలను పట్టించుకోకుండా తీరం వెంబడి గాలిస్తున్నారు. ప్రస్తుతం ఉప్పాడ తీరంలో కొనసాగుతున్న ఈ బంగారం వేట రాష్ట్ర వ్యాప్తంఆ చర్చనీయాంశమైంది.


