RTC bus: మద్యం మత్తులో ఓ వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సునే దొంగలించాడు. ఆర్టీసీ అద్దె బస్సును అపహరించి మార్గమధ్యలోని డివైడర్లు, చెట్లకు ఢీకొంటూ సుదూర ప్రాంతానికి తీసుకెళ్లిన ఘటన ఏపీలో వెలుగు చూసింది. అనంతపురం జిల్లా పామిడి మండలం గార్లదిన్నెకు చెందిన డి.శివశంకర్ (27) కదిరిలోని ఓ క్వారీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి తన పెంపుడు కుక్కతో కలిసి అనంతపురం నుంచి రైలులో కదిరి చేరుకున్నాడు. అనంతరం నేరుగా బస్టాండుకు వెళ్లి నిలిపి ఉన్న ఆర్టీసీ అద్దె బస్సును చోరీ చేశాడు.
డివైడర్లను ఢీకొన్న నిందితుడు: మద్యం మత్తులో ఉన్న నిందితుడు బస్సును ఇష్టానుసారంగా నడిపాడు. మార్గమధ్యలో డివైడర్లు, రోడ్డు పక్కన ఉన్న చెట్లను ఢీకొంటూ అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం తట్టివారిపల్లె సమీపం వరకు బస్సును తీసుకెళ్లాడు. అక్కడ బస్సును నిలిపివేసి నేరుగా మదనపల్లె బస్టాండ్‌కు వెళ్లి తాను చేసిన చోరీ గురించి బస్సు సిబ్బందికి చెప్పడంతో వారు కంగుతిన్నారు. నిందితుడు చెప్పిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించిన ఆర్టీసీ సిబ్బంది, బస్సును సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చారు. అనంతరం నిందితుడిని, బస్సును మదనపల్లె రూరల్ పోలీసులకు అప్పగించగా.. సమాచారం అందుకున్న కదిరి పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కాగా, నిందితుడు శివశంకర్ గతంలో అటవీశాఖ విభాగంలో అవుట్‌సోర్సింగ్ కార్మికుడిగా పనిచేసినట్లు విచారణలో తేలింది.
Also Read-Warangal: అమానవీయ ఘటన.. నాలుగేళ్ల బాలికపై 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారం!

