ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో జరుగుతున్న ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు భారీగా మృతి చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాలైన ప్రజాప్రతినిధులను పోలీసులు అలర్ట్ చేస్తున్నారు. వారిపై దాడి జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ఆయా ప్రజాప్రతినిధులకు ముందస్తు చర్యల్లో భాగంగా రక్షణ కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు(Balaraju) జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 10 రోజుల పాటు ఎలాంటి పర్యటనలు చేయొద్దని తెలిపారు.
పోలీసుల హెచ్చరికలతో ఎమ్మెల్యేను కలిసేందుకు ఎవరూ రావొద్దని, ఫోన్‌లోనే సంప్రదించాలని బాలరాజు కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. ఎమ్మెల్యే బాలరాజు నివాసం ఏజెన్సీ ఏరియా బుట్టాయగూడెం మండలం బర్రింకలపాడులో ఉండటంతో పోలీసులు భద్రతను మరింత పటిష్టం చేశారు. కాగా నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరిలో మావోయిస్టు కీలక నేత నంబాల కేశవరావు కూడా ఉన్నారు.


