Saturday, October 26, 2024
Homeఆంధ్రప్రదేశ్Semi High Speed Rail Corridor: శంషాబాద్ నుంచి విశాఖకు నాలుగు గంటలే.. సెమీ హైస్పీడ్...

Semi High Speed Rail Corridor: శంషాబాద్ నుంచి విశాఖకు నాలుగు గంటలే.. సెమీ హైస్పీడ్ రైలు కారిడార్‌ సిద్ధం..

Semi High Speed Rail Corridor| తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక ముందడుగు పడింది. ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గించే రైల్వే ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రైలు ప్రయాణ సమయం తగ్గడంతో పాటు కొత్త ప్రాంతాలకు రైలు మార్గం రానుంది. శంషాబాద్- విశాఖపట్నం(దువ్వాడ) మధ్య సెమీ హైస్పీడ్ రైలు కారిడార్‌ ఎలైన్‌మెంట్ ఖారరైంది. ఇందులో సూర్యాపేట, విజయవాడ మీదుగా మార్గం ప్రతిపాదించారు. అలాగే విశాఖ నుంచి విజయవాడ, సూర్యాపేటల మీదుగా కర్నూలుకు మరో కారిడార్ కూడా చేపట్టనున్నారు. ఈ మార్గాల్లో ప్రస్తుతానికి రైల్వే ట్రాక్ సర్వే తుది దశకు చేరింది. ఈ సర్వే నివేదికను నవంబర్‌లో రైల్వేబోర్డును సమర్పించనున్నారు.

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ ఇదే కానుంది. ఈ మార్గంలో శంషాబాద్, రాజమహేంద్రవరం విమానాశ్రయాలను అనుసంధానించనున్నారు. దీంతో విమాన ప్రయాణికులు సెమీ హైస్పీడ్‌ రైళ్లలో స్వస్థలాలకు వేగంగా చేరుకునేలా రైల్వేశాఖ ప్రణాళిక రూపొందించింది. గంటకు 220 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేలా సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ను రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి విశాఖపట్నానికి కేవలం నాలుగు గంటల్లోపే చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య రైలు ప్రయాణానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక వందేభారత్ రైలు ద్వారా అయితే‌ 8.30 గంటలు పడుతోంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి విశాఖకు వరంగల్, ఖమ్మం, విజయవాడ మార్గంతో పాటు నల్గొండ, గుంటూరు, విజయవాడ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడీ మూడో లైన్ ద్వారా ప్రయాణ సమయం సగానికి కంటే తగ్గిపోతుంది.

విశాఖపట్టణం నుంచి విజయవాడ, సూర్యాపేట మీదుగా కర్నూలుకు మరో కారిడార్ నిర్మిస్తారు. ఇది విశాఖ నుంచి ప్రారంభమై సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూలు మీదుగా కర్నూలు చేరుకుంటుంది. ఈ మార్గంలో మొత్తం 8 రైల్వే స్టేషన్లు ఉంటాయి. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు రైలే వెళ్లని అనేక పట్టణాలు, జిల్లాలకు రైలు మార్గం సౌకర్యం రానుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నార్కట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కల్వకుర్తి, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ పట్టణాలకూ రైల్వే మార్గం లేదు. ఇక నాగర్‌కర్నూల్‌ జిల్లా మొత్తంలో ఎక్కడా రైల్వే లైనే లేదు. ఇలాంటి ప్రాంతాల మీదుగా ఇప్పుడు ఏకంగా గంటకు 220 కి.మీ. వేగంతో రైళ్లు దూసుకెళ్లే సెమీహైస్పీడ్‌ కారిడార్‌ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News