Reddy Satyanarayana| తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ(99) మృతిపై ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు(CM Chandrababu) సంతాపం తెలియజేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
“తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత,మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి బాధాకరం. 5 సార్లు వరుసగా గెలిచిన ఎమ్మెల్యేగా, మంత్రిగా మాడుగుల నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేసి, నియోజకవర్గ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న సత్యనారాయణ నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనం. రెడ్డి సత్యనారాయణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని ట్వీట్ చేశారు.
“టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. ఐదుసార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికై, మంత్రిగా ప్రజలకు చిరస్మరణీయ సేవలు అందించారు. నిరాడంబర ప్రజా సేవకుడిని పార్టీ కోల్పోయింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను” అని మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ట్వీట్ చేశారు.
కాగా పశ్చిమగోదావరి జిల్లా మాడుగుల నియోజకవర్గానికి చెందిన రెడ్డి సత్యనారాయణ(Reddy Satyanarayana) ఇవాళ ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వయసురీత్యా, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన కన్నుమూశారు. కాగా సత్యనారాయణ టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1983, 85, 89, 94, 99 ఎన్నికల్లో వరుసగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దివంగత సీఎం ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఆయన పశుసంవర్థక శాఖ మంత్రిగా పనిచేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యే, ఓసారి మంత్రిగా పనిచేసినా కూడా నిరాండర జీవితమే గడిపారు. సామాన్య వ్యక్తిగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు.