HomeTop StoriesPodili Earthquake: ప్రకాశం జిల్లాలో వరుస భూ ప్రకంపనలు: పొదిలి ప్రజల్లో తీవ్ర ఆందోళన..

Podili Earthquake: ప్రకాశం జిల్లాలో వరుస భూ ప్రకంపనలు: పొదిలి ప్రజల్లో తీవ్ర ఆందోళన..

Earthquake AP: ఏపీలోని ప్రకాశం జిల్లా పొదిలి పట్టణం మరోసారి స్వల్ప భూ ప్రకంపనలతో ఉలిక్కిపడింది. శుక్రవారం (డిసెంబర్ 5, 2025) తెల్లవారుజామున 3:12 గంటల ప్రాంతంలో భూమి సుమారు 2 నుంచి 5 సెకన్ల పాటు కంపించడంతో స్థానికులు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల సమయంలో పెద్ద శబ్దం కూడా వినిపించినట్లు అక్కడి ప్రజలు మీడియాకు తెలిపారు. అయితే ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.

- Advertisement -

పొదిలి పట్టణంలోని ఇస్లాంపేట, శ్రావణి ఎస్టేట్, బెస్తపాలెం ప్రాంతాల్లో ఈ ప్రకంపనల ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ ఏడాది పొదిలి పరిసర ప్రాంతాల్లో భూమి కంపించడం ఇది మూడవసారి కావడంతో స్థానిక ప్రజల్లో భయం మరింత పెరిగింది. గత మే నెలలో కూడా ఇక్కడి దర్శి, ముండ్లమూరు ప్రాంతాల్లో వరుసగా 3 రోజుల పాటు భూమి కంపించినట్లు రికార్డైంది. ఈ ప్రాంతంలో గత ఏడాది కాలంగా తరచూ భూ ప్రకంపనలు సంభవిస్తుండటంతో ప్రమాదం పొంచి ఉందనే భయాలు ప్రజల్లో పెరిగాయి. మే 6న పొదిలిలో 5 సెకన్ల పాటు భూమి కంపించిన విషయాన్ని మళ్లీ అక్కడి ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.

also read Aisha Sharma: గ్లామర్ తో గాలం వేస్తున్న అయేషా శర్మ

పొదిలిలో తాజాగా వచ్చిన స్వల్ప భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రాంతంలో తరచూ భూమి కంపించడంపై నిపుణుల కమిటీతో పరిశోధన చేపట్టాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గతంలో దర్శి ప్రాంతంలో సంభవించిన ప్రకంపనలపై అధికారులు, నిపుణులు పరిశోధనలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే గుండ్లకమ్మ నదీ పరివాహక ప్రాంతంలోని భూమి పొరలు సర్దుబాటు అవుతుండటం, ముఖ్యంగా భారీ వర్షాలు కురిసిన సమయంలో భూమి లోపలి పొరల కదలికల వల్ల ఇలాంటి ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయని నిపుణులు వెల్లడించారు.

అయితే తాజాగా కురుస్తున్న వర్షాల కారణంగానే ఈ ప్రకంపనలు వచ్చి ఉండవచ్చని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రకంపనలు సాధారణంగా నదీ పరివాహక ప్రాంతాల్లో సంభవిస్తాయని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు. తరచూ ప్రకంపనలు రావడంతో ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలంగా భూకంపాల చరిత్రను కలిగి ఉన్నందున అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. మెుత్తానికి ప్రకాశం జిల్లాను వరుస భూ ప్రకంపనలు వెంటాడుతూ ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఏ అర్థరాత్రి ఏం జరుగుతుందో అని భయాలు అక్కడి ప్రజలను వెంటాడుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News