DJ Sounds Tragedy Incident: చిన్నపాటి ఫంక్షన్ల నుంచి పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల వరకు ఇప్పుడు డీజే సౌండ్ సిస్టమ్‌దే హడావుడి అంతా. డీజే లేకుండా ఏ ఫంక్షన్ అయినా ఉంది అంటే అందులో సందడి లేదనే చెప్పుకుంటారు. చెవుల్లో చిల్లు పడే మ్యూజిక్, గుండెల్లో ధనాధనా మోగుతుంటే.. చిన్నాపెద్దా తేడా లేకుండా ఉర్రూతలూగుతుంటారు. ఇలాంటి ధ్వనులు శరీరంలోని నాడీ వ్యవస్థకు ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నా డీజే హవా మాత్రం తగ్గడం లేదు. తాజాగా డీజే సౌండ్స్ కారణంగా ఓ ఇంటి గుమ్మటం కూలి ఏడుగురికి గాయాలయ్యాయి.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/minister-narayana-sensational-comments-on-varma/
డీజే సౌండ్స్ కారణంగా తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని ఓ ఇంటి గుమ్మటం కూలి ఏడుగురు గాయపడ్డారు. పాలకొండ మండలం బాసూరులో ఏడు నెలల కిందట ఓ పెళ్లి వేడుకలో డీజే సౌండ్ కు డాన్స్ చేస్తూ సుంకరి బంగారు నాయుడు గుండెపోటుతో కుప్పకూలి చనిపోయిన ఘటన మరువక ముందే నరసన్నపేటలో ఓ ఇంటి గుమ్మటం కూలీ దాని కింద ఉన్న ఏడుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. బుధవారం రాత్రి ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
నరసన్నపేటలోని భవానీపురం వీధిలో నందన్న, గౌరమ్మ ఉత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం రాత్రి ఊరేగింపు జరిగింది. ఊరేగింపులో భాగంగా డీజే పెట్టగా.. భవానిపురం వద్దకు వచ్చేసరికి డీజే సౌండ్‌లకు యువత డ్యాన్స్ చేస్తుండగా స్థానికులు వీక్షిస్తున్నారు. ఈ క్రమంలో DJ సౌండ్స్‌కు తీవ్రమైన వైబ్రేషన్స్ రావడంతో రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంటి గుమ్మటం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ సమయంలో గుమ్మటం కింద నిలబడి ఉన్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
గమనించిన స్థానికులు వెంటనే శిథిలాలను తొలగించి వాటి కింద ఉన్న క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళంలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్‌కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీయగా.. భారీ డీజే సౌండ్, దాని వైబ్రేషన్ కారణంగానే గోడ కూలినట్టు స్థానికులు తెలిపారు. దీంతో డీజే సౌండ్ సిస్టమ్‌ను స్వాధీనం చేసుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


