YSRCP:సాధారణంగా తీవ్రమైన రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలతో నిత్యం వార్తల్లో ఉండే నేతలు ఒక్కోసారి ప్రజలను ఆశ్చర్యపరిచే విధంగా వ్యవహరిస్తుంటారు. అలాంటి అరుదైన దృశ్యం విజయవాడలో ఆవిష్కృతమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఒకే వేదికపై ఎంతో ఆప్యాయంగా, మర్యాదపూర్వకంగా పలకరించుకున్న తీరు అందరి దృష్టినీ ఆకర్షించింది.
విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశానికి ఈ ఇద్దరు ప్రముఖులు హాజరయ్యారు. బొత్స సత్యనారాయణ అప్పటికే వేదికపై కూర్చుని ఉండగా, వైఎస్ షర్మిల వేదికపైకి రావడం గమనించి గౌరవ సూచకంగా తన సీటులోంచి లేచి నిలబడ్డారు. అంతేకాదు, “రా అమ్మా.. ఇక్కడ కూర్చో” అంటూ ఎంతో ఆప్యాయంగా పక్కనే ఉన్న కుర్చీని చూపించి ఆహ్వానించారు.
బొత్స చూపిన గౌరవానికి షర్మిల కూడా అంతే మర్యాదపూర్వకంగా స్పందించారు. ఆయన పక్కనే కూర్చుని, బొత్సతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కూడా కాసేపు ముచ్చటించారు. సమావేశం ముగిసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతూ బొత్స సత్యనారాయణకు నమస్కరించి, “అన్నా వెళ్లొస్తా” అంటూ సెలవు తీసుకున్నారు. ఈ దృశ్యం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి, ఒక ప్రజా సమస్యపై జరిగిన సమావేశంలో ఇద్దరు నేతలు ప్రదర్శించిన హుందాతనం, ఆప్యాయత పలువురి ప్రశంసలు అందుకున్నాయి. అయితే అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని కాదని, జగన్‌పై విరుచుకుపడే షర్మిలతో బొత్స సత్యనారాయణ ఇలా సమావేశం కావడంపై ఆ పార్టీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.


