Sharmila Backs Son Rajareddy as True Political Successor of YSR: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు రాజారెడ్డినే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. కాగా, ఇటీవల కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో షర్మిల వెంట ఆయన తనయుడు కనిపిస్తూ ఉండటంతో అతని పొలిటికల్ ఎంట్రీపై మీడియా కొన్ని ప్రశ్నలు సంధించింది. ఈ ప్రశ్నలకు సమాధానంగా షర్మిల మాట్లాడుతూ.. తన కుమారుడు సమయం వచ్చినప్పుడు రాజకీయ రంగప్రవేశం చేస్తాడని పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఓ వర్గం నుంచి ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ క్రమంలో ట్రోలర్స్‌కు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు వైఎస్ షర్మిల. తన కొడుకు వైఎస్ రాజారెడ్డి నిజమైన వైఎస్సార్ రాజకీయ వారసుడని, దీని విషయంలో ఎలాంటి అనుమానం లేదని ఆమె స్పష్టం చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ “నా కొడుకు ఇప్పటివరకు రాజకీయాల్లో అడుగు కూడా పెట్టలేదు. పెట్టక ముందే వైసీపీ ఇంత గందరగోళం సృష్టిస్తుంటే… ఇది భయమా? లేక బెదిరింపా? వాళ్లకే తెలియాలి. నా కుమారుడికి ‘వైఎస్ రాజారెడ్డి’ అనే పేరు స్వయంగా మా నాన్నగారు వైఎస్సార్ పెట్టారు. వైసీపీ ఎంత కేకలు వేసినా, ఎన్ని అడ్డంకులు పెట్టినా ఈ పేరును ఎవ్వరూ మార్చలేరు” అని షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు చెప్పడం ద్వారానే తన కొడుకును రాజకీయాల్లోకి తీసుకొచ్చినట్లు ఓ వీడియోను మార్ఫ్ చేసి ప్రచారం చేస్తున్నారని, అది హాస్యాస్పదంగా ఉందన్నారు.
వైసీపీ, బీజేపీ రహస్య ఒప్పందం బయటపడింది
కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో జగన్ వైఖరిని టార్గెట్ చేస్తూ షర్మిల నిలదీశారు. వైఎస్సార్ జీవితాంతం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను వ్యతిరేకించారని.. కానీ ఆయన కొడుకే ఆర్‌ఎస్‌ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం అవమానకరమన్నారు. రాజ్యాంగం గురించి లోతుగా తెలిసిన న్యాయ నిపుణుడు, తెలుగు వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు? జగన్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ పొత్తులో ఉండగా.. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఎన్‌డీఏ అభ్యర్థికి ఎలా మద్ధతిచ్చిందో చెప్పాలన్నారు. కేసులకు భయపడి ఎన్‌డీఏకి మద్ధతిచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. మరోవైపు, అదానీ, రిలయన్స్ వ్యవహారాలను ప్రస్తావిస్తూ షర్మిల విమర్శలు గుప్పించారు. “వైఎస్సార్ మరణం వెనుక రిలయన్స్ కుట్ర ఉందని జగన్ గతంలో తీవ్రంగా ఆరోపించారు. కానీ అదే రిలయన్స్ వారికి రాజ్యసభ సీటు ఇచ్చాడు. అదానీ కోసం గంగవరం పోర్ట్‌ను సైతం త్యాగం చేశాడు. ఐదేళ్లు అధికారంలో ఉండగా.. బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతీ బిల్లుకు జగన్ మద్దతిచ్చాడు. ఇప్పుడు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ, వైసీపీ మధ్య రహస్య పొత్తు బయటపడిందని వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో నిశ్శబ్దంగా ఉండగా, వైసీపీ మాత్రం బీజేపీకు ఓటు వేసిందని ఆమె మండిపడ్డారు. టీడీపీ-జనసేన పొత్తు బహిరంగమని, కానీ జగన్ బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకున్నాడని షర్మిల ఆరోపించారు.


