Singaiah Wife Lourdu Mary: కొద్ది రోజుల క్రితం పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కిందపడి సింగయ్య అనే వ్యక్తి చనిపోయినట్లు పోలీసులు మాజీ సీఎంపై కేసు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. సింగయ్య మృతితో ఇటు అధికార కూటమి అటు వైసీపీ నాయకుల మధ్య కొద్ది రోజుల వరకు తీవ్రమైన ఆరోపణలు నడిచాయి. కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలను వైసీపీ కొట్టేసింది. ఓ ఫేక్ వీడియో క్రియేట్ చేసి జగన్ ఇమేజ్ డ్యామేజీ చేసే కుట్ర అంటూ ఖండించింది. తాజాగా సింగయ్య భార్య లూర్దుమేరి మాజీ జగన్‌ని తాడేపల్లి నివాసంలో కలిసింది. సింగయ్య కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చి వారికి ధైర్యానిచ్చారు. జగన్‌ని కలిసి వచ్చిన అనంతరం అతని భార్య లూర్దుమేరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఈ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆమె ఆరోపణలు చేశారు.
కాన్వాయ్ ఢీకొన్న తర్వాత తన భర్త చాలా సేపు ప్రాణాలతోనే ఉన్నాడని.. చిన్న గాయాలతోనే ఎలా చనిపోతాడని ఆమె ఆరోపించింది. మాకు ఇది సాధారణ మరణంగా అనిపించడం లేదని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే సింగయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఎందుకు ఆలస్యం చేశారని ఆమె ప్రశ్నించారు. అంతే కాకుండా అంబులెన్స్‌లో అనుమానాస్పద ఘటనలు జరగడం పలు ప్రశ్నలకు తావిస్తున్నాయని ఆమె ఆరోపించారు.
సింగయ్య మరణం వెంటనే కేవలం జగన్ పర్యటన వల్లే తన భర్త ప్రాణాలు కోల్పోయాడని స్టేట్‌మెంట్ కోసం కొందరు టీడీపీ నాయకులు తమ ఇంటికి వచ్చి ఒత్తిడి పెట్టారని ఆమె తెలిపారు. వాళ్లంతా మంత్రి లోకేష్‌కు చెందిన మనుషులని ఆమె కుండ బద్ధలు కొట్టారు. మేము చెప్పినట్లు చెప్పకుంటే పరిస్థితి వేరేలా ఉంటుందని బెదిరించారని లూర్దూ వాపోయారు. మేమూ మీ కులస్థులమేనని ఇందుకు సహకరించాలని పదే పదే విజ్ఞప్తి చేశారని అన్నారు. అంతటితో ఆగకుండా తమ చేతిల్లో తెల్ల కాగితాలు పెట్టి సంతకాలు చేయమని భయపెట్టారని మేరి పేర్కొన్నారు.
పోలీసుల సహకారంతో బెదిరింపులు మరింత పెరిగాయని లూర్దుమేరి కన్నీటి పర్యంతం అయ్యారు. వీడియో చూపించి సంతకాలు చేయాలన్నారు. మా మీద తీవ్ర ఒత్తిడిని తీసుకువచ్చారని దీంతో తీవ్ర భయబ్రాంతులకు లోనయినట్లు చెప్పారు. మాజీ సీఎం జగన్‌పై మాకు నమ్మకముందని, న్యాయం జరగాలని మాత్రమే కోరుకుంటున్నామని ఆమె తేల్చిచెప్పారు. అయితే ఈ ఆరోపణలపై అధికార వర్గాలు ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం సింగయ్య మరణంపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది. ఇందులో జగన్‌తో పాటు అతని డ్రైవర్ ఇతర వైసీపీ నేతలపై కేసు నమోదైంది.