Skill Development Scam: మరో ఏడాదిలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార వైసీపీ నేతలు ప్రభుత్వ పథకాలతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. వచ్చే దఫా ఎన్నికల్లో ఏపీలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతలుసైతం వైసీపీకి దీటుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేఖ విధానాలను ప్రజలకు వివరిస్తున్నారు. చంద్రబాబు వరుస పర్యటనలతో టీడీపీ కేడర్ లో జోష్ నింపుతున్నారు. మరోవైపు లోకేష్ సైతం త్వరలో పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో టీడీపీని కట్టడి చేసేందుకు వైసీపీ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఆ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న చంద్రబాబును ఇబ్బందులు పాలు చేయడం ద్వారా ఆ పార్టీ కేడర్ లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు వ్యూహాన్ని సిద్ధంచేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వానికి జర్మనీకి చెందిన సీమెన్స్ సంస్థకు వృత్తి నైపుణ్యంపై శిక్షణ ఇచ్చే విషయమై ఒక ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు విలువ 3వేల350 కోట్లు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తో సీమెన్స్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అందులో 10శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా 370 కోట్లు . ఈ మొత్తంలో సుమారు 241 కోట్ల78 లక్షల 61వేల508 రూపాయలు దారిమళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ లో నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ లో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చినట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంటుంది. సీఐడీ కేసును తన పరిధిలోకి తీసుకున్న ఈడీ కూపీ లాగుతోంది. ఈ క్రమంలోనే 26 మందికి ఈడీ నోటీసులు ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ మాజీ ఛైర్మన్ గంటా సుబ్బారావు, డైరెక్టర్ లక్ష్మీ నారాయణ, ఓఎస్డీ కృష్ణ ప్రసాద్ లకు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది.
ఈ స్కాంలో ఈడీ విచారణ పక్కకుపెడితే.. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును ఇందులో ఇరికించేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నట్లు ఏపీలో ప్రచారం జరుగుతుంది. ఈకేసు పూర్తిస్థాయిలో విచారణ జరిపి చంద్రబాబును ఇందులోకి లాగడం ద్వారా ఎన్నికల నాటికి టీడీపీ కేడర్ ను చిన్నాభిన్నం అయ్యేలా చేసేందుకు వైసీపీ పెద్దలు వ్యూహాలు సిద్ధం చేసినట్లు ఏపీ టీడీపీ శ్రేణుల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇందుకుబలాన్ని చేకూర్చేలా.. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేశ్ పాత్ర ఈ స్కాంలో ఉందని, ఖచ్చితంగా వారి పేర్లు బయటకు వస్తాయని గంటాపథంగా చెప్పారు. అయితే, టీడీపీ నేతలు మాత్రం అసలు స్కామే లేదని, కావాలనే వైసీపీ ప్రభుత్వం ఇలా నాటకాలు ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.