Smart Street Nellore Inaugurated by CM: నెల్లూరు నగరంలో మైపాడు గేట్ సెంటర్ వద్ద ‘స్మార్ట్ స్ట్రీట్’ వెండింగ్ మార్కెట్‌ను సీఎం చంద్రబాబు నాయుడు శనివారం అమరావతిలోని తన కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. రూ. 7 కోట్లతో అత్యాధునికంగా ఏర్పాటు చేసిన ఈ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్‌లో మొత్తం 30 ప్రత్యేక కంటైనర్లతో 120 దుకాణాలను ఏర్పాటు చేశారు.
ఈ అధునాతన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్‌లోని ఒక్కో కంటైనర్‌లో నాలుగు దుకాణాలు ఉంటాయి. వీటిలో ఫుడ్ స్టాల్స్, నగల దుకాణాలు సహా పలు రకాల వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. మహిళలు, దివ్యాంగులు, వెనుకబడిన వర్గాలకు లబ్ధి కలిగేలా ఈ వినూత్న కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/pm-modi-kurnool-visit-october-16-2025-schedule/
ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, లబ్ధిదారులైన మహిళలతో వీడియో లింక్ ద్వారా నేరుగా మాట్లాడారు. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని సీఎం అన్నారు. నెల్లూరులో ముందుగానే దీపావళి వచ్చిందని సీఎం చమత్కరించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా త్వరలో అన్ని మున్సిపాలిటీల్లో ఇలాంటి స్మార్ట్ స్ట్రీట్ బజార్లు ఏర్పాటు చేస్తామని వివరించారు.
కాగా ఈ వినూత్న ఆలోచన చేసినందుకు గాను మంత్రి నారాయణను, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఛైర్మన్లు, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేసిన మహిళలు.. తమకు ఇలాంటి అవకాశం కల్పించినందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/pawan-kalyan-uppada-pollution-review-fishermen-meeting/
ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొని మాట్లాడారు. ఈ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ అనేక ప్రత్యేకతలతో రూపుదిద్దుకుందని మంత్రి పేర్కొన్నారు. ‘పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ పూర్తిగా సోలార్ విద్యుత్‌ను వినియోగిస్తారు. కస్టమర్ల కోసం ఉచిత వైఫై సౌకర్యం ఏర్పాటు చేశాం. భద్రత కోసం సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. నెల్లూరులో విజయవంతమైన ఈ నమూనాను స్ఫూర్తిగా తీసుకుని, రాష్ట్రంలోని మిగతా నగరాల్లోనూ ఇలాంటి స్మార్ట్ స్ట్రీట్‌లను ఏర్పాటు చేస్తాం’. అని మంత్రి నారాయణ ఈ సందర్భంగా వివరించారు.


