North Andhra: ఉత్తరాంధ్రపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పచ్చి అసత్యాలు మాట్లాడుతున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ తీవ్రంగా విమర్శించారు. జగన్ ఇటీవల చేపట్టిన నర్సీపట్నం పర్యటన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వై.ఎస్. జగన్‌పై ధ్వజమెత్తారు.
రాజధాని కోసం స్టీల్‌ప్లాంట్ స్థలం:
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని విజయ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్టీల్‌ప్లాంట్ స్థలంలో రాజధాని కట్టాలని జగన్ ఆలోచించారని, ఇదే విషయంపై అప్పటి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎల్.వి. సుబ్రమణ్యంను అడిగారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఉక్కు పరిశ్రమపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
పీపీపీ విధానంపై అజ్ఞానం, విద్వేష రాజకీయం:
ప్రభుత్వం అనుసరిస్తున్న పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానం గురించి జగన్‌కు కనీస అవగాహన లేదని విజయ్ ఆక్షేపించారు. కేవలం విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టడానికే, “డబ్బులన్నీ అమరావతికే పెడుతున్నారు” అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైద్య కళాశాలల నిర్మాణం ఆలస్యం కాకుండా, ప్రజారోగ్యానికి మెరుగైన సేవలు అందించేందుకే పీపీపీని తెచ్చామని స్పష్టం చేశారు.
గతంలో ప్రభుత్వ పాఠశాలలకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని, ఇప్పుడు అభివృద్ధి పనులకు అడ్డు తగులుతున్నారని విజయ్ ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారని, ఉత్తరాంధ్ర ప్రజలు ఆయన నాటకాలను నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు.


